Tips to solve workplace problems: ఆఫీసులో మీరు హ్యాపీగానే ఉన్నారా..? - ఆఫీసు ప్రాబ్లెమ్స్
tips to solve workplace problems: కెరీర్‌లో ఎదగాలంటే సంస్థ మనకు అప్పగించిన పనిని సమర్థంగా పూర్తిచేయాలి. అందుకు ఆఫీస్‌లో సౌకర్యవంతమైన వాతావరణంతో పాటు సంతోషంగా ఉండడమూ ముఖ్యమే! అయితే కొంతమంది విషయంలో మాత్రం ఈ హ్యాపీనెస్ ఉండదు. ఇందుకు అనేక కారణాలున్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటా కారణాలు? ఆఫీస్‌లో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..
ఆఫీస్‌లో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి
By
Published : Dec 19, 2022, 12:20 PM IST
tips to solve workplace problems: మనం ఇంట్లో ఎంత సమయం ఉంటామో.. దాదాపుగా ఆఫీస్‌కూ అంతే సమయం కేటాయిస్తాం. ఈ క్రమంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో చక్కటి అనుబంధాన్ని పెంచుకున్నట్లే.. ఆఫీస్‌లో బాస్, సహోద్యోగులతోనూ స్నేహంగా మెలగాలి. అయితే అన్ని సందర్భాల్లో ఇది కుదరకపోవచ్చు. పని, ఇతర విషయాల పరంగా వాళ్లతో మీకు విభేదాలు రావచ్చు.. సహోద్యోగులు మీపై ఈర్ష్య పడడం, వారి అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోవడం.. వంటివి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచచ్చు. తద్వారా ఆఫీస్లో సంతోషం కరువవుతుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో మీరూ వాళ్లలాగే ప్రవర్తించకుండా.. మీ పనితీరును మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి. మీ బాస్, ఇతర సహోద్యోగులతో మాట్లాడి.. మీ ప్రవర్తనలో ఏవైనా లోపాలున్నాయేమో తెలుసుకోండి.. ఆమోదయోగ్యమైతే వాటిని మార్చుకోవడానికీ వెనకాడకండి.. తద్వారా ఆఫీస్‌లో సంతోషంగా పనిచేసుకోవచ్చు.
నెత్తినేసుకోకండి.. మనం చేసే పని వల్ల కూడా ఆఫీస్‌లో సంతోషం కొరవడుతుందంటున్నారు నిపుణులు. కొంతమంది తమ సామర్థ్యానికి మించిన పనిని చేస్తామని గొప్పలు పోతారు.. తమ నైపుణ్యాలకు సంబంధం లేని పనిని స్వీకరించడానికీ వెనకాడరు. దీనివల్ల అటు పనీ చేయలేరు.. ఇటు మానసిక ప్రశాంతతనూ కోల్పోతారు. కాబట్టి తెలిసి తెలిసి ఇలాంటి పొరపాట్లు చేయకుండా.. మీపై నమ్మకంతో సంస్థ మీకు అప్పగించిన పనిని సమర్థంగా చేయడం ఉత్తమం. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికీ ఎప్పుడూ వెనకాడద్దు. ఇదే మిమ్మల్ని ఆఫీస్‌లో ఉత్సాహంగా, ఆనందంగా పనిచేసుకునేందుకు ప్రేరేపిస్తుంది. మీరు కెరీర్‌లో ఎదిగేలా చేస్తుంది.
ఎంత చేసినా వ్యర్థమేనా.. పనికి తగ్గ గుర్తింపు వస్తేనే ఏ ఉద్యోగైనా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అయితే కొంతమంది విషయంలో ఈ గుర్తింపు ఉండకపోవచ్చు.. కాస్త ఆలస్యంగా రావచ్చు. ఈ క్రమంలో ఒత్తిడి ఎదురవడం, ఆఫీస్‌లో సంతోషం కొరవడి ఎప్పుడూ మూడీగా ఉండడం.. వంటివి సహజం. ఇది మీ పనితీరును దెబ్బతీస్తుంది. అంతిమంగా దీని ప్రభావం మళ్లీ మీ కెరీర్ ఎదుగుదల పైనే పడుతుంది. కాబట్టి సంస్థ మీ గురించి ప్రతికూల భావనలోకి వెళ్లకముందు మీరే జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ పనికి తగ్గ గుర్తింపు లభించకపోయినా, మీతో సమానంగా పనిచేసిన ఇతర ఉద్యోగులకు చక్కటి గుర్తింపు వచ్చినా.. ఈ విషయాలు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో తప్పులేదు. తద్వారా మీకు ఎందుకు సరైన గుర్తింపు దక్కలేదో వాళ్లు పునఃపరిశీలిస్తారు. ఈసారి మీకు సానుకూల ఫలితాలు రావచ్చు. కాబట్టి ఓపికతో వ్యవహరించడం మంచిదని గుర్తుపెట్టుకోండి. ఇదే మిమ్మల్ని పని ప్రదేశంలో సంతోషంగానూ ఉంచుతుంది.
ఆ సమన్వయం లోపిస్తే.. చాలామంది ఉద్యోగుల్లో పని ప్రదేశంలో ఆనందం లోపించడానికి ఇంటిని-పనిని సమన్వయం చేసుకోలేకపోవడమే కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇంటి పనులు, ఆఫీస్ పనులతో సతమతమవుతూ వీరు విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంటారు. ఇదే వారిలో మానసిక ఆనందాన్ని దూరం చేస్తుంది. తద్వారా ఆఫీస్‌లో పనిపై ఏకాగ్రత పెట్టలేరు. కాబట్టి దీన్ని అధిగమించాలంటే.. ఇటు ఇంట్లో అటు ఆఫీస్‌లో ప్రాధాన్యతల్ని బట్టి పనుల్ని విభజించుకోవాలి. తద్వారా అనవసరమైన పనులపై ఎక్కువ దృష్టి పెట్టి సమయం వృథా చేసుకోకుండా, ఫలితంగా ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మద్దతు కూడా తప్పనిసరి. ఇలా చేస్తే ఆఫీస్‌లో హ్యాపీగా పనిచేసుకోగలుగుతారు.