మందకృష్ణ పోరాటానికి భాజపా మద్దతు: రావెల - sc classification
ఎస్సీ వర్గీకరణ అంశంపై మందకృష్ణ మాదిగ పోరాటానికి భాజపా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ అమలుపై భాజపా సానుకూలంగా ఉంటూ తగిన చర్యలు తీసుకుంటుందని భాజపా నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఇవాళ గుంటూరు జిల్లా కేంద్రం నుంచి అసెంబ్లీకి మందకృష్ణ మాదిగ చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటం బాధాకరమన్నారు. మందకృష్ణ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారని.. అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారని ఆరోపించారు. మాదిగలకు న్యాయం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుందన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి అమలుకు చర్యలు తీసుకుంటామని రావెల కిషోర్ బాబు వెల్లడించారు.