Ration Rice Smuggling In AP: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ మాఫియా చెలరేగిపోయింది. నిత్యావసరాల పంపిణీని గాల్లో దీపంలా మార్చేసి, చౌక బియ్యాన్ని పెద్ద ఎత్తున అక్రమార్కులు నల్లబజారుకు తరలిస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చౌకబియ్యం స్వాధీనం అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మిల్లుల్లోనూ వందల టన్నుల్లో రేషన్ బియ్యం బయటపడుతునే ఉన్నాయి. రాష్ట్రంలో నెలకు 2 లక్షల8 వేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తుంటే అందులో 40 శాతం వరకు పక్కదారి పడుతున్నాయంటే అక్రమార్కుల దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఏ ప్రాంతం నుంచి అయినా గమ్యస్థానం కాకినాడకే: ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు సేకరించేది వేర్వేరు ప్రాంతాల్లో అయినా అధిక శాతం అక్రమ రవాణా వాహనాల గమ్యస్థానం మాత్రం కాకినాడలోని కొన్ని మిల్లులే. ఒకటీ అరా కృష్ణపట్నం వెళ్తున్నాయి. అక్కడి నుంచి నౌకల్లో విదేశాలకు చేరుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతో ఈ అక్రమ రవాణా మూడు వ్యాన్లు.. ఆరు లారీల్లా సాగిపోతోంది. పేదలకు ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొని తరలించడంతో పాటు.. తూకంలో తరుగు రూపంలో భారీగా గోదాముల నుంచి మాయం చేస్తున్నారు. కొన్నిచోట్ల పేదలకు నెలల తరబడి పంపిణీ కూడా జరగడం లేదు. ఆ బియ్యం ఎటుపోతోందనేది ప్రశ్నార్థకంగా మారింది. పేదల బియ్యం పక్కదారితో ప్రభుత్వ ఖజానాకు ఏటా 4 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది.
ఎండీయూలు ఎంతిస్తే అంతే: రాష్ట్రంలో ఇంటింటికీ రేషన్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోంది. గత నాలుగేళ్లుగా ఏ నెలలోనూ బియ్యం సరిగా అందుతాయనే భరోసా కార్డుదారులకు కరవైంది. కొన్ని గ్రామాలు, పట్టణాల్లో బియ్యం ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రేషన్ బండ్ల ద్వారా పంపిణీ చేస్తారో, డీలర్ల ద్వారా ఇప్పిస్తారో కూడా అంతుపట్టదు. వచ్చినప్పుడు తీసుకోవడమే అన్నట్లుగా తయారైంది. ఎండీయూ ద్వారా బియ్యం వచ్చినా కొన్నిచోట్ల 20 కిలోలకు బదులు.. 10 నుంచి 15 కిలోల చొప్పున ఇస్తున్నారు. మిగిలిన బియ్యం లేవంటున్నారు. మొత్తంగా ఇంటింటికీ రేషన్ పంపిణీ పేరుతో అవకతవకలు మరింత పెచ్చుమీరాయి.
సీఎం సన్నిహితులే అక్రమాల్లో చక్రం తిప్పుతున్నారు: అక్రమ రవాణా భారీగా పెరిగింది. అయినా సీఎం జగన్ ముచ్చటపడి ప్రారంభించిన ఇంటింటికి రేషన్ పథకం కావడంతో.. అధికారులూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అక్రమాలు బయటపడినా, చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరొస్తుందనే భయంతో మిన్నకుంటున్నారు. అందులోనూ సీఎంకి సన్నిహితుడైన కాకినాడ జిల్లాకు చెందిన నేత కుటుంబమే చక్రం తిప్పుతుండటంతో ఎక్కడ ఏం జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు. ఒకటి రెండు చోట్ల మొక్కుబడి తనిఖీలతో సరిపెట్టేస్తున్నారు. దీంతో అక్రమార్కులు పట్టపగలే కార్డుదారుల నుంచి కిలోల లెక్కన బియ్యం కొనేసి.. బాహాటంగానే తరలిస్తున్నారు. చౌకబియ్యం అక్రమాల నిగ్గు తేలుస్తామంటూ పౌరసరఫరాల శాఖ.. రైస్ ఏజ్ టెస్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం.
ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో నష్టం: రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా పథకం, రాష్ట్ర ప్రభుత్వ కార్డుల కింద ఏటా 25 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. నెలకు 2.31 లక్షల టన్నులు జరుగుతోంది. ఒక్కో కిలో బియ్యంపై రాయితీగా ప్రభుత్వాలు 39 రూపాయల 35 పైసలు చొప్పున ఖర్చు చేస్తున్నాయి. ఏడాదికి 9 వేల 618 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అయితే ఇందులో 40 శాతం బియ్యం నల్లబజారుకు తరలుతోంది. కార్డుదారుల నుంచి దాదాపు 40 శాతం అంటే 85 వేల టన్నులు దళారులు కొంటున్నారు. నామాత్రంగా కిలోకు 12 రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వానికి కిలోకు 39 రూపాయల 35 పైసల చొప్పున దాదాపు 4 వేల 13 కోట్లు నష్టం వస్తోంది. దోపిడీ చేసిన బియ్యాన్ని వివిధ రూపాల్లో మార్కెట్‌కు, విదేశాలకు అక్రమార్కులు చేరవేస్తున్నారు.
బియ్యం వాహనాలే కావడంతో అక్రమాలకు కలసివస్తోంది: ఎండీయూ వాహనాలు లేక ముందు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసేవారు. కార్డుదారుల నుంచి కొన్నవి, ఇవ్వకుండా మిగుల్చుకున్న బియ్యాన్ని రాత్రి సమయాల్లో నల్లబజారుకు తరలించి విక్రయించేవారు. పోలీసు, రెవెన్యూ అధికారుల నిఘా ఉండేది. విజిలెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తుండేవి. ఎండీయూ వ్యవస్థ ఏర్పాటయ్యాక.. వాటి ఆపరేటర్లే కొన్నిచోట్ల బియ్యం వ్యాపారం చేస్తున్నారు. చాలా చోట్ల కార్డుదారుల నుంచి నేరుగా వారే కిలో 10రూపాయల నుంచి 15 రూపాయల చొప్పున ఇచ్చి కొంటున్నారు. అవే వాహనాల్లో అక్రమ వ్యాపారులకు చేరవేస్తున్నారు. బియ్యం వాహనాలే కావడంతో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయని తనిఖీ చేయడం దాదాపుగా జరగదు. ఇదే వారికి మరింత కలిసివస్తోంది. కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలుపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. సగటున ఒక్కో వాహనదారు రోజువారీ పంపిణీ చేసే బియ్యంలో 30 శాతం నుంచి 40 శాతం వరకు కార్డుదారుల నుంచి తిరిగి కొంటున్నట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల రోజుకు 30 క్వింటాళ్లు పంపిణీ చేస్తే అందులో 12 క్వింటాళ్ల వరకు కొనేస్తున్నారు.
పట్టుబడితే సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు:విశాఖ జిల్లాలో ఎండీయూ వాహనాల ద్వారా ఇచ్చే బియ్యంలో కోత పెడుతున్నారు. పెందుర్తి మండలం సుజాతనగర్ సీ-2 జోన్ పార్క్ ఏరియాలోని రేషన్ బండి వద్ద అధిక శాతం కార్డుదారులకు.. ఇవ్వాల్సిన బియ్యం కన్నా తక్కువలో తక్కువ 10 కేజీల వరకు కోత విధించారు. వాటికి బదులుగా డిజిటల్ పేమెంట్‌గా నగదు చెల్లించారు. కొందరు వాచ్మెన్లు తమకు బియ్యం కావాలన్నా ఇవ్వలేదు. అగనంపూడి 85వ వార్డు తలారివానిపాలెంలో ఈ నెల 9న చాలా మందికి కిలోన్నర నుంచి రెండు కేజీల వరకు బియ్యం తగ్గించి ఇచ్చారు. దీనిపై కార్డుదారులు ప్రశ్నించగా ‘అధికారులు అంతే ఇమ్మన్నారు.. ఎవరికి చెబుతారో చెప్పుకోండి అని సమాధానం ఇచ్చారు. వంశీ అనే కార్డుదారుకు 15 కేజీల బియ్యానికి పదమూడున్నర కేజీలే ఇచ్చారు. మరికొందరికి 20 కేజీలకు పద్దెనిమిదిన్నర కిలోలే దక్కాయి . లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎండీయూ నిర్వాహకుణ్ని సస్పెండ్ చేశారు.
అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో జీసీసీ డిపో సేల్స్‌మన్, ఎండీయూ ఆపరేటర్ కలిసి.. 3.65 టన్నుల బియ్యం, 305 కిలోల పంచదార, 339 కేజీల కందిపప్పును పక్కదారి పట్టించారు. గ్రామాలకు వస్తే సిగ్నల్ సరిగ్గా ఉండదంటూ గిరిజనులను నమ్మించి ముందే వేలిముద్రలు తీసుకున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సేల్స్‌మెన్‌ను సస్పెండ్ చేసిన అధికారులు.. ఎండీయూ ఆపరేటర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి.
అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే: అక్రమార్కులు కార్డుదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని.. బస్తాల్లోకి మార్చి మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి లారీల ద్వారా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు చేరవేస్తున్నారు. బియ్యం తరలింపులో ప్రతి నియోజకవర్గంలోనూ అధికార పార్టీ నేతల పాత్ర స్పష్టమవుతోంది. ప్రతి జిల్లాలోనూ కొందరు వైసీపీ నేతలకు చెందిన మిల్లుల్లోనే రీసైక్లింగ్ జరుగుతోందని ఇటీవల బియ్యం పట్టుబడిన సందర్భాల్లో వెల్లడైంది. మూతపడిన మిల్లులను అద్దెకు తీసుకుని యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తరలింపు సమయంలో ఒక్కో లారీకి లక్ష వరకు ముట్టచెబుతున్నారు. వాహనం రోడ్డెక్కిన దగ్గర నుంచి మిల్లుకు, అక్కడ నుంచి పోర్టు సమీపంలోని మిల్లుకు చేరే వరకు.. అంతా అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది.
సూత్రధారులు కూడా అధికార పార్టీ నేతలే: ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేతలే అక్రమ బియ్యం వ్యాపారానికి సూత్రధారులు. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ కేంద్రంగా ఇదంతా జరుగుతోంది. పెళ్లూరులో ఒక మిల్లు నిర్వాహకుడు, వైఎస్సార్సీపీ నాయకుడు కలిసి భారీ ఎత్తున చౌకబియ్యాన్ని తరలిస్తున్నారు. గ్రోత్ సెంటర్లో మూతపడిన మరో మిల్లులో రహస్యంగా చౌక బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, తెల్లసంచుల్లో నింపి బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం పేరుతో విక్రయిస్తున్నారు.