కరోనా సమయంలో పేద వర్గాల వారి ఆకలి తీర్చటంలో, ప్రభుత్వ సాయాన్ని ప్రజలకు చేరవేయటంలో ముందు వరుసలో ఉండి పని చేస్తున్నా ప్రభుత్వం తమని గుర్తించటం లేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు శానిటైజర్లు కూడా పంపిణి చేయటం లేదని... ప్రభుత్వం నుంచి ఐదు విడతల కమిషన్ బకాయిలు రావాల్సి ఉన్నాయని వారు చెబుతున్నారు. తమ సమస్యల పరిష్కారానికి 8వ విడత రేషన్ పంపిణీని ఇవాళ నిలిపివేశారు.
కోవిడ్ పై పోరాడుతున్న వారిలో మేం కూడా ముందు వరుసలో ఉన్నాం. మొదట్లో బయోమెట్రిక్ విధానం తీసేసి రేషన్ పంపిణీకి అనుమతించారు. కానీ ఇపుడు బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. ప్రతి కార్డుదారుని వేలి ముద్రలు తీసుకోవాల్సి రావటంతో డీలర్లు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కర్నూలులో ఒకరు, గుంటూరులో ఇద్దరు డీలర్లు మరణించారు. మా ప్రాణాలకు కూడా రక్షణ కల్పించాలి. డీలర్లందరికీ కరోనా బీమా చేయాలి. అలాగే బకాయిలు చెల్లించాలి. శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయాలి. ఇతర రాష్ట్రాల్లో కేంద్రసాయం, రాష్ట్ర సాయం రెండూ ఒకేసారి ఇస్తున్నారు. ఏపీలో మాత్రం నెలకు మూడు విడతలుగా ఇవ్వాల్సి వస్తోంది. ఇది కరోనా వ్యాప్తికి దారితీస్తోంది.
-ప్రసాద్, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు