బియ్యం కార్డు పొందడానికి గతంలో మాదిరిగా నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నూతన విధానం అమల్లోకి వచ్చింది. అర్హులైన వారు తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే వారికి కచ్చితంగా పది రోజుల్లోపు కార్డులను చేతికి అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది జూన్ నుంచి అమలవుతున్న ఈ విధానం జిల్లాలో తొలి ప్రాధాన్యతాంశంగా ముందుకు సాగుతోంది. దీంతోపాటు అదనంగా ఉన్న కుటుంబ సభ్యులను కార్డులో చేర్చడం, వివాహం అయిన జంటలను పాత కార్డు నుంచి విడదీసి (స్ప్లిట్), వారికి కొత్త కార్డు మంజూరు చేయడం వంటివి కూడా గడువులోగా పూర్తి చేస్తున్నారు. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని వాటిని కూడా సరిచేయాలని పలువురు కోరుతున్నారు.
ఆరు అంశాల్లో సామాజిక పరిశీలన..
గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయగానే వారి ఆధార్ నంబర్ల ఆధారంగా ఆరు అంశాలపై ఆన్‌లైన్ సోషల్ ఆడిట్ (సామాజిక పరిశీలన) జరుగుతుంది. సంబంధితులందరికీ కలిపి మూడు ఎకరాల మాగాణి, 7 ఎకరాల మెట్ట భూమికి మించి ఉన్నాయా? 1000 చదరపు అడుగులకు మించి పట్టణంలో ఇంటి స్థలం, ఆదాయ పన్ను శాఖకు రిటర్న్‌లు దాఖలు చేయడం, నెలకు 300 యూనిట్లకు మంచి విద్యుత్తును వినియోగించడం, నాలుగు చక్రాల వాహనం (కారు వంటివి) ఉండడం, ప్రభుత్వ ఉద్యోగిగా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ అనంతరం పింఛన్ పొందడం వంటివి ఉంటే వారికి కార్డు మంజూరు కాదని ఈ దశలోనే తేలిపోతుంది. నిబంధనల మేరకు అర్హత ఉందని తేలితే వెంటనే ఆయా దరఖాస్తులను క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం వీఆర్వోకు పంపుతున్నారు. అనంతరం వాటిని తహసీల్దారు ఆమోదిస్తున్నారు.
జిల్లా తాజా సమాచారం ఇలా ఉంది..
మండలాలు | 60 |
మంజూరు చేసిన కొత్త బియ్యం కార్డులు | 23,746 |
స్ల్పిట్ కార్డులు | 25,522 |
పాత కార్డుల్లో కొత్త చేరికలు | 1,21,866 |
జిల్లాలో గుంటూరు మండలం ఇప్పటి వరకు 5,350 కొత్త కార్డులు మంజూరు చేసి తొలి స్థానంలో ఉండగా, నరసరావుపేట - 1187, తెనాలి - 1039 మంజూరులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.