Explosions in Ramagundam OCP-5 : తెలంగాణలోని రామగుండం ఒకటో రీజియన్ పరిధిలోని భూ ఉపరితల గని పేలుళ్లు.. పరిసర గ్రామస్థులను హడలెత్తిస్తున్నాయి. బొగ్గు కోసం పేలుళ్లు నిత్యకృత్యమవడంతో చుట్టూ పక్కల గ్రామస్థులు... బెంబేలెత్తిపోతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు... ఏళ్లుగా స్థానికులంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. ముఖ్యంగా రోజూ మధ్యాహ్నం 3.30 నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు నిర్వహించే పేలుళ్ల మూలంగా అక్కడ భూకంపమే చోటు చేసుకుంటుంది. ఇలా ఏళ్లుగా పరిమితికి మించి ఇష్టానుసారంగా భారీ శబ్దాలతో పేలుళ్లు నిర్వహిస్తున్నా.. పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు.
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం : ఓసీపీ-5 పేలుళ్లు రామగుండంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పరిమితికి మించి సాగుతున్న పేలుళ్లతో.. చుట్టుపక్కల గ్రామస్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి నెలకొంది. పేలుళ్ల శబ్దాలు వింటే చాలు.. గ్రామస్థులు ఉలిక్కిపడుతున్నారు. భారీ శబ్దాల ధాటికి ఎక్కడ ఇంటి పైకప్పు పెచ్చులూడి మీద పడుతుందోనని కొందరు.. ఇంటి గోడలు కూలిపోతాయేమోనని ఇంకొందరు.. ఇలా స్థానికులంతా భయం గుప్పిట బతుకుతున్నారు.
పండగకి చుట్టాలను పిలిస్తే వచ్చే పరిస్థితి లేదు :దద్దరిల్లుతున్న భారీ పేలుళ్లతో చంటి పిల్లలు ఉలిక్కిపడి గుక్కపట్టి ఏడుస్తుంటే... వృద్ధుల గుండెల్లో దడ పుడుతోంది. పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న నిరుపేదల ఇళ్లన్నీ నెర్రెలు వారుతున్నాయి. ఇళ్లలోని వస్తువులన్నీ కింద పడడం, ఇంటిగోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఇంటి గోడల జాయింట్లు ఊడిపోవడం, బీటలు వారుతున్నాయంటే పేలుళ్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి ఏదైనా పండగకి చుట్టాలను పిలిస్తే ఆ శబ్దాలు, దుమ్ము, ధూళి కారణంగా ఎవరూ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు.