MP GVL Narasimha Rao comments: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేసిన అనంతరం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఘాటుగా స్పందించారు. బీజేపీలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సముచిత గౌరవం ఇచ్చామని, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగాను పార్టీ అధిష్ఠానం నియమించిందన్నారు.
విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో రంగ-రాధ అభిమాన సంఘం ప్రతినిధులతో జీవీఎల్ నరసింహారావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియాతో మాట్లాడారు. కన్నా వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమైనవని అన్నారు. సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ అనుమతితో చేసినవేనని, పార్టీలో పదవుల నుంచి ఎవరిని తొలగించినా, నియమించాలన్నా అవి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు కావని స్పష్టతనిచ్చారు.
తనపై కన్నా చేసిన వ్యాఖ్యలపై స్పందించబోనని జీవీఎల్ తెలిపారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉన్నాయని, ఎంపీగా తనకు ఉన్న అవకాశాల మేరకు తాను పని చేస్తానని వివరించారు. బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి అత్యున్నతమైందని, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి పార్టీలో అధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భం అత్యంత అరుదైనదని ఆయన గుర్తు చేశారు. కన్నాకు బీజేపీ అలాంటి అవకాశం ఇచ్చిందని, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కూడా పూర్తి స్థాయి గౌరవాన్ని కలిపించిందని తెలిపారు.