నూతన పాలకవర్గ సభ్యులు రైతుల అభ్యుదయానికి పాల్పడాలని గుంటూరు జిల్లా రాజుపాలెంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెంలో వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. హోంమంత్రి సుచరిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు, వైకాపా నేతలు పాల్గొన్నారు. రైతులకు మేలు చేయటమే వైకాపా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఎంపీ అన్నారు.
అన్నదాత పండించిన పంటను సంతోషంగా అమ్ముకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సంస్కరణల బిల్లులు రైతులకు దోహదపడతాయని తెలిపారు. బిల్లులను సమర్ధవంతంగా అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి కేంద్రానికి పార్లమెంట్ సమావేశంలో విన్నవించానని ఎంపీ వివరించారు. ప్రమాణస్వీకారం చేసిన పాలకవర్గ సభ్యులు రైతులకు మేలు చేసేవిధంగా పనిచేయాలని ఆయన సూచించారు.