ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Railway Line Work రాష్ట్రవాటా రాలేదు.. అందుకే కొత్త రైల్వేలైన్ వేయలేదు..! కేంద్రం మొత్తుకుంటున్న పట్టించుకోని వైసీపీ సర్కార్! - కడప బెంగళూరు రైల్వే లైను

Railway Line Works in AP: రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై వైసీపీ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. కానీ, ప్రభుత్వ మాటలకు వాస్తవ పరిస్థితులకు అసలు పొంతన కుదరటం లేదు. ప్రభుత్వ మాటలన్నీ నీటిమీద రాతలేనని రాష్ట్రంలోని రైల్వే లైన్ల పనులు నిరుపిస్తున్నాయి. అందుకు సాక్షలే రైల్వేశాఖ మంత్రి సెలవిచ్చిన సమాధానాలు.

Railway Line Works
నిలిచిన రైల్వేపనులు

By

Published : Aug 2, 2023, 9:06 AM IST

Updated : Aug 2, 2023, 2:22 PM IST

Railway line Works pending In AP: రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రతిసారీ ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ చేతలే చెప్పిన మాటలు రూపుదాల్చటం లేదు. ముఖ్యమంత్రి మాటలకు, వాస్తవ పరిస్థితికి ఏమాత్రం పొంతన ఉండదు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ల పనులే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర వాటా నిధులిస్తే పనులు పరుగులు పెట్టిస్తామని రైల్వేశాఖ నెత్తీ నోరు మొత్తుకుంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రం వాటా ఇవ్వకపోవడం వల్లే పనులు ఆగిపోయాయని రైల్వేశాఖ మంత్రి పార్లమెంటులో పలు దఫాలు ఏపీ పరువు తీసినా.. ముఖ్యమంత్రి జగన్‌లో కనీస చలనం కూడా కనిపించడం లేదు.

రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నా.. సడలని సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు గతేడాది జూన్ 21న ముఖ్యమంత్రి జగన్‌ సెలవిచ్చారు. ప్రాధాన్య రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా, చెల్లింపుల సమస్య లేకుండా చూస్తూ.. ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు పూర్తి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి మాటలు ఎంత అవాస్తవమో లోక్‌సభ సాక్షిగా రైల్వేశాఖ మంత్రి ఇచ్చిన సమాధానం తేలతెల్లం చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లిస్తే పనుల్లో వేగం: ఏపీలో వ్యయం పంచుకునే విధానంతో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వడం లేదని గత ఏడాది జులై 27న రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఇప్పటికే 17వందల 98 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని ఇలాంటి పరిస్థితుల్లో ఏ కొత్త ప్రాజెక్టూ చేపట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. వైసీపీకి చెందిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు అశ్వినీ వైష్ణవ్ ఈమేరకు జవాబిచ్చారు. ఎంపీ తన పరపతి ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చేలా నచ్చజెబితే గొప్ప సాయం చేసినవారవుతారని.. అప్పుడు ఏపీలో ప్రాజెక్టుల వేగం పెంచేందుకు వీలవుతుందని అన్నారు. ఏపీ ప్రభుత్వం తన వాటా చెల్లిస్తేనే కడప - బెంగళూరు రైలుమార్గం పనులు చేపడతామని.. కడప ఎంపీ వైఎస్​ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జులై 26న రైల్వేశాఖ మంత్రి లోక్‌సభలో సమాధానం ఇచ్చారు.

రాష్ట్ర వాట అందించలేదు: రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమైన రైల్వే లైన్ల పనులు అస్సలు ముందుకు సాగడం లేదు. 308.7 కిలోమీటర్ల పొడవైన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను.. 2వేల 700 కోట్ల అంచనా వ్యయంతో 2011-12లో మంజూరైంది. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాష్ట్రం భరించడంతోపాటు ఉచితంగా భూసేకరణ చేసి ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు రాష్ట్ర వాటా కింద 13వందల 50 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 6 కోట్లు మాత్రమే ఇచ్చింది.

నిలిచిన నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ : విజయవాడ - చెన్నై రైలు మార్గానికి ప్రత్యామ్నాయంగా నడికుడి - శ్రీకాళహస్తి లైన్ దోహదపడుతుంది. దీనికి గత ప్రభుత్వంలో వేగంగా భూసేకరణ చేసి అప్పగించడంతో.. న్యూ-పిడుగురాళ్ల - శావల్యాపురం మధ్య 46 కిలోమీటర్ల లైన్ పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు ఇంకా 600 హెక్టార్ల వరకు భూసేకరణ చేసి రైల్వేశాఖకు అప్పగించాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఏళ్ల తరబడి సాగుతున్న నదులపై రైల్వే వంతెనలు: ఇక 57.21 కిలోమీటర్ల పొడవున్న కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను.. 2వేల 125 కోట్ల అంచనా వ్యయంతో 2000-2001లో మంజూరైంది. ప్రాజెక్ట్ వ్యయంలో 25 శాతం వాటాగా 525 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 2.69 కోట్లు మాత్రమే ఇచ్చింది. కోనసీమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమై ఈ ప్రాజెక్టు.. రాష్ట్రం వాటా ఇవ్వకపోవడంతో ముందుకు సాగడం లేదు. నిధులు చెల్లించడంపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వైనతేయ, వశిష్ఠ, గౌతమి నదులపై వంతెనల పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు 190 హెక్టార్ల మేర ఇంకా భూసేకరణ చేయాల్సి ఉన్నా.. దాన్నీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ప్రభుత్వ వాట ఇస్తే కడప-బెంగళూరు రైల్వే లైను పూర్తి: ఇక 268 కిలోమీటర్ల పొడవైన కడప-బెంగళూరు రైల్వే లైను.. 3వేల 38 కోట్ల అంచనా వ్యయంతో 2008-09లో మంజూరైంది. ఇందులో ఏపీ పరిధి వరకు ఖర్చయ్యే 2వేల 849 కోట్లలో 50 శాతం రాష్ట్రం వెచ్చించాల్సి ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 14 వందల 25 కోట్లు ఇవ్వాలి. ఇందులో గత ప్రభుత్వాలు 190 కోట్ల వరకు విడదల చేశాయి. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లోని పెండ్లిమర్రి, ఇడుపులపాయ, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, వాయల్పాడు, మదనపల్లె మీదుగా నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును భూసేకరణ భారాన్ని సాకుగా చుపుతూ పులివెందుల మీదుగా మళ్లించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21.30 కిలోమీటర్ల మేర మార్గం 2017 నాటికి పూర్తయింది. ఆ తర్వాత ప్యాకేజీలో పనుల కోసం రైల్వేశాఖ పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

అందుకే కొత్త రైల్వేలైన్ వేయలేదు..!
Last Updated : Aug 2, 2023, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details