Sankranthi crowd in telugu states: సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లేవారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. రైల్వే, బస్ స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. హైదరాబాద్ నుంచి వారి వారి స్వస్థలాలకు వెళ్లేవారితో.. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతోపాటుగా ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్లు సందడిగా మారిపోయాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం 105 ప్రత్యేక రైళ్లు..
సొంతూళ్లకు వెళ్లేవారి సౌకర్యార్థం 105 ప్రత్యేక రైళ్లు, 197 ట్రిప్పులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే నుంచి 37 రైళ్లను.. 92 ట్రిప్పులుగా నడిపించనున్నారు. ఇతర జోన్‌ల నుంచి... 29 రైళ్లతో 38 ట్రిప్పులు నడిపించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 12 జనసాధరన్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేశ్ తెలిపారు.
ఛార్జీలతో జేబులకు చిల్లులు..
సువిధ రైళ్ల ఛార్జీలతో జేబులకు చిల్లులు పడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. సికింద్రాబాద్, కాకినాడ స్లీపర్ ఛార్జీ సాధారణంగా రూ. 355 ఉండగా... సువిధ రైలులో రూ. 1,235 తీసుకుంటున్నారని తెలిపారు. థర్డ్ ఏసీ సాధారణ టికెట్ రూ. 935 అయితే... సువిధలో రూ. 2,360 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. సికింద్రాబాద్-విజయవాడ మధ్య స్లీపర్ టికెట్ ఛార్జీ సాధారణంగా రూ. 225 ఉండగా.. సువిధలో రూ. 1,135 చెల్లించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. కాచిగూడ- నర్సాపూర్ మధ్య సాధారణ రైలులో స్లీపర్ టికెట్ రూ. 320 ఉండగా.. సువిధ రైలులో రూ. 1,080 వరకు వసూలు చేస్తున్నట్లు.. ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఒక కుటుంబంలో ఐదారుగురు ఉంటే.. వచ్చిన జీతంలో సగానికి సగం రైళ్ల ఛార్జీలకే చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.