MP Raghu Rama Approached the High Court: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలను భద్రపరచాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. జనరల్ మెడిసిన్, రేడియాలజీ, కార్డియాలజీ వైద్యులు అందించిన నివేదికలను భద్రపరచాలని న్యాయవాది కోరారు. రెండేళ్లు పూర్తి కావడంతో నివేదికలను ధ్వంసం చేసేందుకు అధికారులు.. ప్రభుత్వ అనుమతి కోరినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వైద్యుల నివేదికను ధ్వంసం చేస్తే ఈ కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు మాయం అయిపోతాయని తెలిపారు. అన్నింటినీ భద్రపరచి కోర్టుకు ఇవ్వాల్సిందిగా ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ కోరారు. వెంటనే దీనిపై స్పందించి లిఖితపూర్వకమైన కౌంటర్లు దాఖలు చేయాలని.. అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాలకృష్ణారావు ఈ మేరకు గురువారం ఆదేశాలిచ్చారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 13కి వాయిదా వేసింది.
కస్టడీలో ఉన్న తనను సీఐడీ పోలీసులు కొట్టారని.. ఎంపీ రఘురామ కృష్ణరాజు రిమాండ్‌కు తరలించిన సమయంలో గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జికి వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. 2021 మే 15వ తేదీన రఘురామ.. జడ్జికి వాంగ్మూలం ఇవ్వగా న్యాయస్థానం ఆ వివరాలను పరిగణలోకి తీసుకుంది. అనంతరం వైద్య పరీక్షల కోసం ఎంపీని గుంటూరు జీజీహెచ్‌కు తరలించమని.. ఆ తర్వాత గుంటూరులోని రమేశ్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది.
వైద్య పరీక్షలు నిర్వహించిన, కార్డీయాలజీ, రేడియాలజీ, ఆర్థోపెడక్, జనరల్ మెడిసిన్ వైద్యులు.. ఇచ్చిన మెడికల్ రిపోర్టులను, నోట్ ఫైళ్లను కనుమరుగు చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ చూస్తున్నారని ఎంపీ రఘురామ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. శరీరంపై గాయాలున్నాయని వైద్యులు నివేదికల్లో పేర్కొన్నారని తన అభ్యర్థనను కోర్టు ముందుంచారు. ఇప్పటి వరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆ నివేదికను బయటపెట్టలేదని ఆరోపిస్తూ కోర్టుకు వివరించారు. అంతేకాకుండా 16వ తేదీన తప్పుడు నివేదిక ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ఒరిజినల్ నివేదికను ధ్వంసం చేయాలని చూస్తున్నారనే నేపథ్యంలో రఘురామ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీనిపై న్యాయస్థానం స్పందించగా.. రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. రెండు సంవత్సరాలు పూర్తి అయ్యిందనే కారణాన్ని సాకుగా చూపిస్తూ.. వైద్య నివేదికలను వైద్యాధికారులు ధ్వంసం చేయాలని చూస్తున్నారని కోర్టుకు వివరించారు. ధ్వంసం చేస్తే ఈ కేసులో కీలక అధారాలు చెరిగిపోతాయని.. వాస్తవాలు బహిర్గతం కావని కోర్టుకు విన్నవించారు. దీంతో ఇది రెండు సంవత్సరాల క్రితం నాటి వ్యవహారమని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పూర్తి వివరాలను సమర్పించడానికి సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆంగీకారించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.