Purandeshwari Demands Compensation to Farmers for Damaged Crops:తుపానులు, ఈదురుగాలులు, వడగళ్లు, అతివృష్టి లేదంటే అనావృష్టి అని రాష్ట్రంలో రైతులపై ఏదోఒక ప్రభావం పడుతూనే ఉంది. వీటికి తోడు జగన్ సర్కారు వికృత రాజకీయం తోడవటంతో రాష్ట్రంలో అన్నదాతలు కష్టాల్లో తేలుతున్నారు. పేదలపక్షపాతినని చెప్పుకునే సీఎం జగన్‌కు మాత్రం చీమకుట్టినట్లైనా లేదు. తాజాగా మింగ్జాం తుపాన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తీరని వేదన మిగిల్చింది. వరి పంటను కోసి కల్లాల్లోకి తెచ్చుకున్న రైతులు కురుస్తున్న వర్షాలతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు తడిసి, నానిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు, ప్రతిపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు.
కరవు నష్టం కొండంత - ప్రభుత్వ సాయం గోరంత! 'నలిగిపోతున్న రాష్ట్ర రైతులు'
మిగ్‌జాం తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఆహారాధాన్యాలతో పాటు ఉద్యాన, వాణిజ్య పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. పంటకు బీమా చేసిన రైతులు ఎంతమంది లేనివారు ఎంతమంది అనే గణాంకాలను ప్రభుత్వం వెంటనే బహిరంగపరచాలని కోరారు. వరి పంట చేతికి అందుతున్న దశలో తుపాను వారి ఆశలను చిదిమేసిందన్నారు. ఎకరానికి సుమారుగా 40 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన తర్వాత పంట ఇంటికి రాదు అని తెలిసి రైతు పడే బాధను రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధం చేసుకుని పూర్తి స్ధాయి పెట్టుబడి సాయం అందించాలని కోరారు.