ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Pulichintala Project: రబ్బరుసీలూ మార్చలేదు..! - పులిచింతల గేట్ల పరిస్థతి

పులిచింతల ప్రాజెక్టులో 16 నెంబరు గేటు కొట్టుకుపోవడంతో అధికారులు మిగిలిన గేట్ల సామర్థ్యంపై దృష్టి సారించారు. గేట్ల నుంచి లీకేజీలు అరికట్టే రబ్బరు సీళ్లు పలుచోట్ల దెబ్బతినడం, లోపలికి పోవడం ద్వారా లీకేజీలున్నట్లు గుర్తించారు. నీటి నిల్వ ఉన్నందున ప్రస్తుతం రబ్బరు సీలు మార్చే పరిస్థితి లేదు. నిపుణులైన డ్రైవర్లను పంపి గన్నీబ్యాగ్‌లో దూది పెట్టి లీకేజీలను పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారు.

pulichintala rubber seals
pulichintala rubber seals

By

Published : Aug 11, 2021, 11:47 AM IST

పులిచింతల ప్రాజెక్టుకు రెండేళ్లుగా పూర్తి స్థాయి నిర్వహణ చేపట్టకపోవడంతో గేట్ల నుంచి లీకేజీలు వస్తున్నాయి. 16వ నంబరు గేటు కొట్టుకుపోవడంతో మిగిలిన గేట్ల పరిస్థితి, నిర్వహణలో ఇబ్బందులు తదితర అంశాలపై ఇంజినీర్లు దృష్టి సారించారు. డ్రోన్‌ కెమెరా ద్వారా గేట్లను, డ్యామ్‌ నిర్మాణ భాగాలను చిత్రీకరించి అధ్యయనం చేస్తున్నారు. గేట్ల నుంచి లీకేజీలు అరికట్టే రబ్బరు సీళ్లు పలుచోట్ల దెబ్బతినడం, లోపలికి పోవడం ద్వారా లీకేజీలున్నట్లు గుర్తించారు. జలాశయంలో పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉన్నట్లయితే లీకేజీల ద్వారా 600 క్యూసెక్కులు దిగువకు వస్తున్నట్లు గుర్తించారు. రెండేళ్లుగా గేట్లకు సంబంధించి మరమ్మతులు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఇంజినీరు ఒకరు అభిప్రాయపడ్డారు.

లీకేజీల ద్వారా 600 క్యూసెక్కులు
ప్రాజెక్టు 24 గేట్ల ద్వారా 20లక్షల క్యూసెక్కులను దిగువకు వదలవచ్చు. ప్రాజెక్టులో గరిష్ఠ నీటి నిల్వ 45.77 టీఎంసీలు. జలాశయంలో గరిష్ఠ స్థాయికి నీరు చేరువైతే గేట్ల నుంచి 600 క్యూసెక్కుల నీరు లీకేజీల ద్వారా వృథా అవుతోంది. ప్రాజెక్టులో 12 టీఎంసీలు నిల్వ ఉన్నట్లయితే 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా నదిలోకి వెళుతోంది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రధానంగా 12, 21, 23 నంబరు గేట్ల వద్ద లీకేజీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పుడు గేట్ల నిర్వహణలో వచ్చే ఇబ్బందులను గుర్తించి వేసవిలో జలాశయంలో నీటిమట్టం తగ్గాక మరమ్మతు చేయాలి. అయితే రెండేళ్లుగా నిర్వహణకు గుత్తేదారులు ముందుకు రాకపోవడం, గతేడాది 13 టీఎంసీలకు తగ్గకుండా నీటి నిల్వలు ఉండడంతో రబ్బరు సీళ్లు సైతం మార్చలేకపోయారు. దీని వల్ల గేటుకు, కాంక్రీటు నిర్మాణానికి మధ్య గ్యాప్‌ ఏర్పడి లీకేజీల ద్వారా నీరు వృథా అవుతోంది. 16వ నంబరు గేటు కొట్టుకుపోవడంతో మిగిలిన వాటి వద్ద లీకేజీలు అరికట్టే పనులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. లీకేజీలున్న ప్రాంతంలో ఇప్పుడు రబ్బరు సీళ్లు మార్చే పరిస్థితి లేనందున నిపుణులైన డైవర్లను పంపి గన్నీబ్యాగ్‌లో దూది పెట్టి లీకేజీలను పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారు.

గుత్తేదారుల స్పందన కరవు
ప్రాజెక్టు గేట్లు, ఇతర మరమ్మతు పనుల కోసం గతేడాది రూ.1.8 కోట్లతో టెండర్లు పిలిచారు. గుత్తేదారులు ఎవరూ పనులు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో టెండర్లు దాఖలు కాలేదు. దీంతో గతేడాది పనులు చేయలేకపోయారు. ఈ ఏడాది మళ్లీ రూ.2.85 కోట్లతో నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపారు. ఇవి ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నాయి. నిపుణులతో పనులు చేయించాల్సి రావడం, ఇచ్చేది చిన్న మొత్తం కావడంతో గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. గుత్తేదారులు ముందుకు రాకపోవడం, ప్రాజెక్టులో గతేడాది నుంచి 13 టీఎంసీలకు తగ్గకుండా నీటి నిల్వలుండటం వల్ల రబ్బరుసీళ్లు మార్చడం తదితర పనులు చేయలేకపోయామని డ్యామ్‌ అధికారి ఒకరు తెలిపారు.

పులిచింతలలో 18.20 టీఎంసీల నీరు నిల్వ
అచ్చంపేట, న్యూస్‌టుడే: ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులో మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు 18.20 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఏఈఈ రాజశేఖర్‌ తెలిపారు. ఎగువ నాగార్జునసాగర్‌ పరీవాహక ప్రాంతం నుంచి 49,407 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా ఉందని చెప్పారు. దిగువకు ప్రకాశం బ్యారేజీకి ఒక గేటు ఒక మీటరు ఎత్తులో తెరిచి 8,563 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా పది వేల క్యూసెక్కులు, లీకేజీ ద్వారా 400 క్యూసెక్కులు కలిపి మొత్తం 18,963 క్యూసెక్కులు అవుట్‌ఫ్ల్లోగా ఉందన్నారు.


ఇదీ చదవండి:srisailam: శ్రీశైలం జలశయానికి కొనసాగుతున్న వరద.. 2 గేట్లు ఎత్తి నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details