పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. ఆ పనులు చేసిన గుత్తేదారుకు పరిహారం రూపంలో లెక్కకు మించి నిధులను ప్రభుత్వం కుమ్మరించాల్సి వచ్చింది. సరైన న్యాయపోరాటం చేయకపోవడం, తగిన సమయంలో కోర్టుల్లో అప్పీలుకు వెళ్లకపోవడంతో పరిహారం విషయంలో వడ్డీల రూపంలోనే కొన్ని కోట్ల రూపాయలను ఇప్పటివరకు గుత్తేదారు అందుకున్నారు. ఇప్పటికీ ఆర్బిట్రేషన్ అంశం న్యాయస్థానంలో పెండింగులో ఉంది. పనుల నాణ్యత నాసిగా ఉన్నా గుత్తేదారుపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోగా, సాక్షాత్తూ విజయవాడలోని స్వరాజ్ మైదానం, జగ్గయ్యపేటలోని జలవనరులశాఖ స్థలాలను తన చెల్లింపుల కోసం ఎటాచ్ చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ గుత్తేదారు ఉత్తర్వులు పొందడం చర్చనీయాంశమయింది. పులిచింతల ప్రాజెక్టు పనులకు 2005లో ప్రభుత్వం రూ.681.604 కోట్లతో పాలనామోదం ఇచ్చింది. ఇతరత్రా మినహాయించి గుత్తేదారు ఎంఎస్ ఎస్‌సీఎల్- సీర్ కంపెనీ ఈ పనులను రూ.268.86 కోట్లకు పూర్తిచేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. అలాంటిది ఈ ప్రాజెక్టులో ఉన్న ఆర్బిట్రేషన్ ఒప్పందం వల్ల గుత్తేదారుకు పరిహారం రూపంలోనే రూ.400 కోట్లకు పైగా చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే జలవనరులశాఖ అధికారులు స్టే కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చెల్లింపుల్లో సగం ఇచ్చి రావాలని న్యాయస్థానం పేర్కొంది. దీంతో 2019 జనవరిలో రూ.199 కోట్లు గుత్తేదారుకు ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన సగానికి సంబంధించిన అంశం ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
పులిచింతల నిర్వహణ ఎవరి చేతిలో?
పులిచింతల ప్రాజెక్టు నిర్వహణ ఎవరి చేతిలో ఉందన్నది చర్చనీయాంశమవుతోంది. గుత్తేదారు బిల్లుల అంశం ఇంకా పెండింగులోనే ఉన్నందున నిర్వహణ విషయంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై జలవనరులశాఖ అధికారులతో మాట్లాడితే ప్రభుత్వ నిర్వహణలోనే ఉందని చెబుతున్నారు. 2016లో గుత్తేదారుకు తుది బిల్లులు చెల్లించేశామని అన్నారు. తర్వాత రెండేళ్ల పాటు గుత్తేదారు ప్రాజెక్టు నిర్వహించారని చెప్పారు. అనంతరం ప్రభుత్వానికి అప్పచెప్పినట్లుగా లేఖ రాశారని అధికారులు చెబుతున్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఈ విషయంపై సమాధానం తెలియజేయకపోయినా ప్రస్తుతం నిర్వహణ పనులన్నీ తామే చూస్తున్నామని వెల్లడించారు.