మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. తెదేపా ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబు రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మౌలిక వసతుల కల్పన కోసం, నిర్మాణ సామగ్రి బిల్లుల చెల్లింపుల నిమిత్తం 2019 జూన్ 1 తర్వాత వచ్చే నిధుల బదిలీ ఉత్తర్వులను మాత్రమే పరిగణనలోకి తీసుకునేందుకు పంచాయతీరాజ్ కమిషనర్‌కు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన మెమోను రద్దు చేయాలని కోరారు. మెమోను రద్దు చేయకపోతే మొదట నిర్వహించిన పనులకు చెల్లింపులు సాధ్యంకాదని పేర్కొన్నారు.
2018 - 19లో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు భారీగా జరిగాయన్నారు . సీఎఫ్ఎమ్ఎస్ విధానం ద్వారా చెల్లింపులకు నిధుల బదిలీ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ చెల్లింపులు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. ఒకసారి పనులు పూర్తై, నిధుల బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాక ఆ చెల్లింపులు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం 2019 జూన్ తర్వాత వచ్చే నిధుల బదిలీ ఉత్తర్వులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని మెమో జారీచేసిందన్నారు.