GADAPA GADAPA PROGRAM : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురుస్తున్నాయి. ఎమ్మెల్యే, మంత్రులు, నాయకులు ఇలా ఎవరైనా కానీ ప్రజలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీస్తున్నారు. తమ దగ్గరకు వచ్చిన వారిని ప్రశ్నిస్తున్నారు.
గడప గడపలో తిరగకపోతే ముఖ్యమంత్రి జగన్ వార్నింగ్లు.. ప్రజల దగ్గరకు వెళ్తే ప్రశ్నల వర్షం. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల పరిస్థితి ఇది. సీఎంకు భయపడి గడప గడపకు వెళ్తే.. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితే మాజీ హెం మంత్రి మేకతోటి సుచరితకు ఎదురైంది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొండేపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఆమెకు ప్రజల నుంచి సమస్యలు వెల్లువెత్తాయి. రైతు భరోసా రాలేదని, అమ్మఒడి ఇవ్వలేదని, ఇంటి స్థలం మంజూరు చేయలేదని కొందరు బాధితులు ఎమ్మెల్యే సుచరితకు తెలిపారు. ప్రభుత్వం పథకాలు ఇస్తున్నప్పటికీ.. కక్ష సాధింపు చర్యలు బాగోలేదని ఎమ్మెల్యేకి విశ్రాంత వీఆర్వో సూచించారు. ప్రజలలో అది చెడు ప్రభావం చూపుతుందన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అలాంటివి లేవు కదా అంటూ ఎమ్మెల్యే పక్కన ఉన్న వైసీపీ నాయకులు తెలిపారు. ఓ మహిళ భర్త.. తమకు చేయూత పథకం రాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.