Jagan comments on personal information collection: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చిలక పలుకులు పలికారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారంటూ ఉన్నవీ లేనివీ కల్పించి మరీ నానాయాగీ చేసిన జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. పౌరుల వ్యక్తిగత డేటా సేకరణనేరమంటూ ప్రతిపక్ష నేతగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన జగన్.. ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు ముసుగులో వాలంటీర్ల ద్వారా పౌరుల వ్యక్తిగత సమాచార సేకరణను వ్యవస్థీకృతం చేశారు. ఇదేదో రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధ హక్కు అన్నట్లుగా రాష్ట్ర ప్రజల సమాచారం సమస్తం సేకరిస్తున్నారు.
ప్రజల ఆధార్, బ్యాంకు ఖాతా, ఓటరు ఐడీ, పాన్, పౌరుల రాజకీయ ఆసక్తులు, ప్రతి ఇంట్లోని మహిళల ఫోన్ నంబర్లు, పౌరుల వేలిముద్రల నుంచి.. వివాహేతర సంబంధాలున్నాయా? ఎవరెవరితో గొడవలు ఉన్నాయి? తదితర సమగ్ర వివరాలు తీసుకుంటున్నారు. ఈ సమగ్ర సమాచారాన్ని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరిట ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతికందిస్తోందని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా చెబుతున్నాయి. ఈ సున్నిత సమాచారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే దుర్వినియోగమవుతుందంటూ నీతివాక్యాలు చెప్పిన జగన్.. ఇప్పుడేం సమాధానం చెబుతారని విపక్షాలు నిలదీస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి ఆయనకు అర్హత ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
పౌరుల వ్యక్తిగత వివరాలు సేకరించే అధికారం వాలంటీర్లకు ఎక్కడిదని.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ వివరాలు సేకరిస్తున్నారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని.. ఆ సమాచారంతో వాలంటీర్లకు, ప్రభుత్వానికి ఏం పనిని అడుగుతున్నారు. పౌరుల రాజకీయ ఆసక్తులను ప్రభుత్వం ఎందుకు తెలుసుకుంటోందని.. ఎవరు ఏ పార్టీ మద్దతుదారైతే ప్రభుత్వానికి ఎందుకని నిలదీస్తున్నారు. ఈ డేటా ఆధారంగా తమ పార్టీని వ్యతిరేకించే వారి ఓట్లు తొలగించడానికే వివరాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పౌరుల ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు దుర్వినియోగమైతే ఎవరు బాధ్యత వహిస్తారని.. వాటి ఆధారంగా వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కొల్లగొడితే ఎవరి తెచ్చి ఇస్తారని మండిపడుతున్నారు. మహిళల ఫోన్ నంబర్లు సేకరించడం వల్ల వారి భద్రతకు ముప్పు వాటిల్లదా అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాలంటీర్ల నిర్వహణ, శిక్షణ కోసం ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న రామ్ ఇన్ఫో, ఉపాధి టెక్నో సర్వీసెస్, మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డియన్ సర్వీసెస్‌ల కన్సార్షియానికి ఈ సమాచారం వెళ్తోందని, అక్కడి నుంచి వైసీపీకు రాజకీయ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న ఐప్యాక్‌కు, అక్కడి నుంచి జగన్‌కు చేరుతోందని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా నిరూపిస్తున్నాయి. ఈ సమాచారాన్ని విశ్లేషించి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారని వివరిస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడలోని గుణదల, తిరుపతిల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యాలయాల్లో పౌరుల వ్యక్తిగత సమాచార విశ్లేషణ జరుగుతోందన్న ఫిర్యాదులున్నాయి. అసలు ఆ కార్యాలయాలు ఎవరు నిర్వహిస్తున్నారు? అక్కడ రాష్ట్ర పౌరుల వ్యక్తిగత ఎందుకు ఉందంటే ప్రభుత్వం నుంచి గానీ.. వైసీపీ నుంచి గానీ ఎలాంటి సమాధానం లేదు.
పౌరుల వ్యక్తిగత డేటా ఎవరి చేతుల్లోకి వెళ్తోందో తెలియడం లేదు. దీని నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తున్నారో కూడా తెలియదు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, ప్రతి పౌరుడి సమగ్ర వివరాలు సేకరిస్తున్న వైసీపీ ప్రభుత్వం వాటిని 360 డిగ్రీల కోణంలో ఎందుకు ప్రొఫైలింగ్ చేయిస్తోందో అర్థంకావడం లేదు. ఈ ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం మాత్రం సమాధానలివ్వడం లేదు. వీటిపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయడం లేదు. అత్యంత సున్నితమైన పౌరుల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిస్థితి ఏంటని ప్రజలు భయపడుతున్నారు.