People Protest for Water: ఆరు నెలలుగా విద్యుత్, నీటి సరఫరా సరిగా లేదు. తమ సమస్యలపై పలుమార్లు అధికారులకు, నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. వీధి దీపాలు కూడా వెలగక పోవడంతో ప్రజలు రాత్రి సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, చిన్నారులు రాత్రి పూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నీటి సరఫరా కూడా అరకొరగా ఉందని కాలనీవాసులు అంటున్నారు. ఎండల తీవ్రత ఎక్కువ అవుతుండటంతో.. తాగునీరు సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
దీనికి తోడు.. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి.. కావాలనే కాలనీకి నీళ్లు, విద్యుత్, వీధి దీపాలు వంటి సౌకర్యాలను కల్పించడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఆ సదరు వ్యక్తి.. కాలనీకి నీళ్లు రాకుండా చేస్తానని చెప్పాడని అంటున్నారు. దీనిపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఆ వ్యక్తికి ఓటు వేయలేదా.. మేము ఓటు వేస్తేనే కదా ఆయన గెలిచారు అని ప్రశ్నిస్తున్నారు. అయినా సరే ఇలా చేయడం ఎంత వరకు సబబని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే: తాగునీటి సరఫరా సరిగా లేదంటూ గుంటూరు నగరంలో ప్రజలు రోడ్డెక్కారు. గుజ్జనగుండ్ల నుంచి పలకలూరు వెళ్లే మార్గంలో రత్నగిరి కాలనీవాసులు రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ కోసం అధికారులు ఇళ్లు తొలగించారు. ఆ సమయంలో కొన్ని పైపు లైనులు కూడా పాడైపోయాయి. దీంతో తాగునీటి సరఫరా సజావుగా జరగడం లేదు. వారం రోజులకుపైగా మంచినీరు రాకపోవడంతో కాలనీవాసులు ఆగ్రహంతో రోడ్డెక్కారు.