ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lawyers strike: నల్లకోటుపై లాఠీ.. ఆందోళనలో న్యాయ సమాజం

Police attacks on lawyers: న్యాయవాదులపై పోలీసుల భౌతిక దాడులు పెరిగాయని.. నోటికొచ్చినట్లు దూషిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. న్యాయ సమాజం విస్మయం వ్యక్తం చేసింది. పోలీసుల చర్యల్ని ప్రశ్నిస్తే నోటీసులిచ్చి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన బార్‌ కౌన్సిల్‌ సభ్యులు.. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Police attacks on lawyers
Police attacks on lawyers

By

Published : May 8, 2023, 7:16 AM IST

నల్లకోటుపై లాఠీ.. ఆందోళనలో న్యాయ సమాజం

Police attacks on lawyers: రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిని తప్పుపడుతూ బార్ అసోసియేషన్లు, ఏపీ బార్ కౌన్సిల్ తీర్మానాలు చేస్తున్నాయి. కోర్టు విధులను బహిష్కరించి నిరసనలు తెలియజేస్తున్నాయి. న్యాయస్థానం నియమించిన అడ్వొకేట్ కమిషనర్ ఠాణాకు వెళితే పోలీసులు చేయి చేసుకున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అవగతమవుతోందని న్యాయవాదులు అంటున్నారు.

రాజమహేంద్రవరంలో..ఏప్రిల్ 1వ తేదీ రాత్రి ఒంటిగంట సమయంలో.. ద్విచక్ర వాహనంపై బయలుదేరుతుండగా స్పెషల్ మెుబైల్ పార్టీకి చెందిన ఎస్సై, కానిస్టేబుల్ లాఠీలతో కొట్టారని యువ న్యాయవాది పుగ్గిరాల సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదినని, స్నేహితుడి ఇంటి నుంచి తిరిగి వెళుతున్నానని చెప్పినా పట్టించుకోలేదన్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఏప్రిల్ 3న కోర్టు విధులను బహిష్కరించి న్యాయవాదులు ధర్నా చేశారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి ఠాణాకు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌ వీరనారాయణ తనపై చేయిచేసుకున్నారని హైకోర్టు న్యాయవాది జి వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఏప్రిల్ 12న హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేశారు.

పల్నాడు జిల్లాలో..వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకోవాలని శావల్యాపురం ఎస్సై గల్లా రవికృష్ణ, పోలీసులు తనపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారని హైకోర్టు న్యాయవాది బిలాల్ అహ్మద్ పేర్కొన్నారు. కడప సబ్ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, తాహిర్ హుస్సేన్, పోలీసులు తనను తీవ్రంగా కొట్టి దుర్భాషలాడారని న్యాయవాది సీ సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వాహనంలోకి ఎక్కించుకొని కొట్టుకుంటూ తీసుకెళ్లారన్నారు. అనంతపురం జిల్లా మడకశిర న్యాయవాది ఆర్ నాగేంద్ర పోలీసుల దురుసు ప్రవర్తనను ఏపీ బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. విధి నిర్వహణలో భాగంగా ఠాణాకు వెళ్లిన తనను, తన క్లైంట్లను ఎస్సై పి శేషగిరి, పోలీసు కానిస్టేబుల్ మసూద్ వలి బెదిరించారన్నారు. అనంతపురం ఎస్పీకి లేఖ రాస్తూ సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలుకు చెందిన న్యాయవాది షేక్ తహీరున్నీసా.. పోలీసులు న్యాయవాదుల్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఏపీ బార్ కౌన్సిల్‌కు లేఖ రాశారు.

అనంతపురం జిల్లా..అడ్వొకేట్ కమిషనర్‌గా ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం 1వ పట్టణ ఠాణాకు వెళ్లిన న్యాయవాది ఉదయ్ సింహారెడ్డి, కోర్టు సిబ్బందిపై పోలీసులు చేయి చేసుకున్నారు. 2022 అక్టోబర్ 21న చోటు చేసుకున్న ఈ ఘటనపై హైకోర్టు కన్నెర్ర చేసి సుమోటోగా స్వీకరించింది. ఓ వ్యక్తిని పోలీసులు అక్రమ నిర్బంధంలో ఉంచారన్న ఆరోపణ రావడంతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు.. ఉదయ్ సింహారెడ్డిని అడ్వొకేట్‌ కమిషనర్‌గా నియమించింది. స్టేషన్‌కు వెళ్లిన అడ్వొకేట్‌ కమిషనర్‌ గిరీష్ అనే వ్యక్తి అక్రమ నిర్బంధంలో ఉన్నారని, పోలీసులు కొట్టినట్లు గమనించారు. అతన్ని కోర్టుకు తీసుకెళ్లతానని చెప్పగా.. సీఐ ఇస్మాయిల్ అడ్వొకేట్ కమిషనర్‌తో దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారు.

న్యాయవాదిపైనే కేసు.. హైకోర్టు అప్పటి న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ డీజీపీ నుంచి రెండో వారాల్లో వివరణ కోరాలని రిజిస్ట్రీకి స్పష్టం చేశారు. సకాలంలో డీజీపీ నుంచి సమాధానం రాలేదని హైకోర్టు రిజిస్ట్రీ.. న్యాయమూర్తికి తెలిపారు. హైకోర్టు పంపిన లేఖ అందుకున్నప్పటికీ డీజీపీ స్పందించనట్లు కనిపిస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ ఘటనపై డీజీపీ నివేదిక ఇస్తూ.. అనంతపురం డీఐజీ ఈ వ్యవహారంపై విచారణ చేశారని, బాధ్యులకు రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్ నిలిపేస్తున్నట్లు తెలిపారు. న్యాయం చేయాలని ఠాణాకు వెళ్లిన న్యాయవాదిపైనే విజయవాడ భవానీపురం పోలీసులు అక్రమంగా కేసు పెట్టారు. పోలీసుల ఈ చర్యను ఖండిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేశారు. అక్రమ కేసును ఎత్తివేయాలని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినదించారు.

పోలీసులు, ప్రత్యర్థి కక్షిదారుల నుంచి న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. న్యాయవాదులు చేపట్టే చర్యల విషయంలో దాడులకు పాల్పడవద్దని, పోలీసులు స్వీయ నియంత్రణ పాటించాలని బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు అన్నారు. బార్ కౌన్సిల్ ఇలాంటి చర్యలను ఖండిస్తోందన్నారు. న్యాయవాదుల రక్షణ నిమిత్తం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముసాయిదా చట్టాన్ని రూపొందించిందని, చట్టం చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ చట్టం వస్తే న్యాయవాదుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతోందని న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details