Lorry Unions Protest in telangana : పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, జీవో 714 రవాణా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. వనస్థలిపురం పరిధిలోని ఆటోనగర్లో లారీ అడ్డా వద్ద జాతీయ రహదారిపై మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, పెంచిన వంట గ్యాస్, నిత్యావసరాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని.. లేకపోతే భవిష్యత్లో నిరసనలు మరింత బలంగా ఉంటాయని స్పష్టం చేశారు.
"ప్రధాని మోదీ తెలంగాణకు రావడాన్ని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఖండిస్తున్నాం. జీఎస్టీ విధానాన్ని తీసుకువచ్చిప్పుడు.. దిల్లీ మొదలైన రాష్ట్రాలను ఒప్పించి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోనికి తీసుకువస్తామని చెప్పారు. కానీ ఆయన ఆ మాటను నిలబెట్టుకోలేదు." -నందారెడ్డి, లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు