Protests Against Chandrababu Arrest: గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో.. సైకిల్ యాత్ర చేపట్టారు. బాపట్ల జిల్లా పర్చూరులోని దీక్షా శిబిరంలో శ్రేణులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా అమరావతిలో నిర్వహిస్తున్న రిలే దీక్షలో టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో.. కృష్ణానదిలో దిగి శ్రేణులు జలదీక్ష చేపట్టారు. గన్నవరంలో ఓ వ్యక్తి.. అరగుండు కొట్టించుకుని.. వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో దీక్షా శిబిరంలో నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కెనాల్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలే దీక్షలో మాజీ మంత్రి జవహర్ పాల్గొన్నారు. కాకినాడలోని శ్రేణులు.. రోడ్డుపై అర్ధనగ్నంగా నడుస్తూ.. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలనే నినాదాలతో హోరెత్తించారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో భారత రాజ్యాంగాన్ని పట్టుకుని మోకాళ్లపై కూర్చుని ఆందోళన చేశారు. కొత్తపేటలో బార్ అసోసియేషన్ లాయర్లు, అయ్యప్ప స్వామి మాలధారులు నిరసన తెలిపారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సతీమణి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు ర్యాలీగా వెళ్లి.. ఆలయంలో పూజలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విశాఖలో మహిళలు రోడ్డు ఊడుస్తూ.. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అనే నినాదాలతో హోరెత్తించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కాసాపేటలో మత్స్యకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నిరసన తెలిపారు. సాలూరు మండలం శివరాంపురంలోని శ్రేణులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జలదీక్ష చేపట్టారు..