గుంటూరు అంకమనగర్కు చెందిన ఝాన్సీరాణి... జూన్ 26న మగబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి అనారోగ్యంగా ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ క్రమంలో బుధవారం 3.30 గంటలకు శిశువు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించి, మరణ ధ్రువీకణ పత్రాన్ని ఇచ్చారు.
మరోసారి చనిపోయినట్లు...
ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి శిశువులో కదలికలు గమనించిన తల్లిదండ్రులు... స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వైద్యులను సంప్రదించారు. చిన్నారి బతికే ఉన్నట్లు ఆర్ఎంపీ వైద్యులు చెప్పడంతో హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... మార్గమధ్యంలో చనిపోయినట్లు మరోసారి సర్టిఫికెట్ ఇచ్చారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారి బంధువులు... మొదట చనిపోకుండానే చనిపోయినట్లు నిర్ధారించి ఇంటికి పంపించారంటూ ఆందోళనకు దిగారు. ఇంటికి తీసుకెళ్లి ఉండకపోతే శిశువు బతికే వాడని ఆవేదన వ్యక్తం చేశారు.