Gang arrested over forcing girl into prostitution at guntur: గుంటూరు జిల్లాలో ఓ బాలికను వ్యభిచార కూపంలోకి దించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా సమయంలో వైద్యం కోసం బాలిక గుంటూరులోని జీజీహెచ్‌లో చేరింది. ఆ బాలికను పరిచయం చేసుకున్న ముఠాలోని సూర్ణ కుమారి అనే మహిళ.. ప్రకృతి వైద్యం చేయిస్తానని మాయమాటలు చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. అనంతరం ఓ వ్యభిచార గృహానికి తరలించి బాలికను బలవంతంగా వృత్తిలోకి దించింది.
ఆ బాలికతో.. విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, నెల్లూరులోని పలు ప్రాంతాలలో బలవంతంగా వ్యభిచారం చేయించారు. నెల్లూరులో సదరు ముఠా కళ్లుకప్పి, అక్కడి నుంచి పారిపోయి విజయవాడ చేరుకున్న బాలికను మరో ముఠా అదుపులోకి తీసుకుంది. వారు కూడా బాలికచేత బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఎట్టకేలకు రహస్యంగా తండ్రికి ఫోన్ చేసి చెప్పింది బాధితురాలు. దీంతో.. తండ్రి మేడికొండరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాలుగు బృందాలుగా ఏర్పడి బాలిక ఆచూకీ కనుగొన్నారు.