ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2023, 7:35 AM IST

Updated : Dec 24, 2023, 8:48 AM IST

ETV Bharat / state

'ఆస్తి మూరెడు పన్ను బారెడు'- ప్రజల నడ్డివిరుస్తున్న జగన్ ప్రభుత్వం

Property Tax Increased after YSRCP Came to Power: కుడి చేతితో చిల్లర విదిల్చి ఎడమ చేతితో రెట్టింపు లాక్కొవడం ఈ విద్య సీఎం జగన్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే నమ్మండి పేదలను ఉద్దరించడానికి పుట్టిన అవతార పురుషుడినంటూ గొప్పలు చెప్పుకునే జగన్‌ పన్నుల రూపంలో మాత్రం వారి రక్తం పీల్చుతున్నారు. పెంచిన విద్యుత్‌ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలకు తోడు పట్టణాల్లో నివసిస్తున్న వారిపై ఆస్తిపన్ను భారం మోపారు. ఐదేళ్లకు ఓసారి ఆస్తిపన్ను పెంచే విధానానికి మంగళంపాడిన వైసీపీ సర్కార్‌ ఏటా పెంచుకుపోయే కొత్త విధాం తీసుకొచ్చింది. తద్వారా మూడేళ్లలోనే ప్రజల నుంచి వెయ్యికోట్లు అదనంగా పిండుకుంది.

property_tax
property_tax

'ఆస్తి మూరెడు పన్ను బారెడు'- ప్రజల నడ్డివిరుస్తున్న జగన్ ప్రభుత్వం

Property Tax Increased After YSRCP Came to Power:ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగంలో ఆస్తిపన్ను కీలకమైనది. నగరాలు, పట్టణాల్లో నివసించే పేదలు, మధ్యతరగతి వారిపై భారం పడకుండా గత ప్రభుత్వాలు ఆస్తి పన్నును అయిదేళ్లకోసారి పెంచేవి. భారం మరీ ఎక్కువగా ఉందని భావిస్తే 10 నుంచి 15 ఏళ్లకు ఓసారి ఆస్తి పన్నులు సవరించేవి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంప్రదాయానికి మంగళంపాడింది. వీలైనంత ఎక్కువగా ప్రజల నుంచి పన్నులు రాబట్టడమే ధ్యేయంగా ఏటా ఆస్తిపన్ను పెంచే విధానాన్ని తీసుకొచ్చింది.

మూడేళ్లుగా జనం ముక్కుపిండి దండుకుంటోంది. ఇది చాలదన్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆస్తుల విలువలను పెంచినపుడల్లా పన్ను మొత్తం మళ్లీ పెరుగుతోంది. దీన్ని ఒకేసారి వర్తింపజేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని పెరిగిన దానికి సమానమయ్యే వరకు ఏటా 15% చొప్పున విధిస్తోంది. అంటే పన్ను పోటును నిరంతర ప్రక్రియగా మార్చేసింది.

ప్రాజెక్టులు, కాంట్రాక్టులే కాదు విద్యుత్‌ కూడా జగన్ అస్మదీయులకే!- ఏకంగా 47వేల కోట్ల దోపిడీ

వెయ్యికోట్లకు పైగా ప్రభుత్వ ఖాతాలోకి:గతంలో వార్షిక అద్దె విలువ ఆధారంగా ఐదేళ్లకు ఓసారిఆస్తిపన్ను పెంచే విధానం నగరాలు, పట్టణ ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండేది. జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే దీనికి బదులు ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను పెంచే కొత్త విధానం తీసుకొచ్చింది. దీనికి మళ్లీ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖతో లింకు పెట్టింది. ఆస్తుల విలువలను ఆ శాఖ పెంచినప్పుడల్లా ఆస్తిపన్ను కూడా పెంచాలని నిర్ణయించింది. 2020-21లో రాష్ట్రంలోని 123 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్ను డిమాండ్‌ 1,157.54 కోట్లుగా ఉండేది.

కొత్త విధానం అమల్లోకి వచ్చాక 1,319.97 కోట్లకు పెరిగింది. అంటే పట్టణ ప్రజలపై 162.43 కోట్ల భారం వేశారు. పెరిగిన మొత్తం పన్నులో ఇది 15 శాతమే. పెరిగిన దానికి సమానమయ్యే వరకు 2022-23, 2023-24లోనూ 15 శాతం చొప్పున ఆస్తిపన్ను పెంచి అమలు చేశారు. మొత్తంగా ప్రజల నుంచి వెయ్యికోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రాబట్టింది.

వైఎస్సార్సీపీ నేతల గుప్పిట్లో సిలికా - క్వార్ట్జ్‌ వ్యాపారం - తనిఖీల పేరిట వందల కోట్లలో దోపిడీ

పనులంటేనే హడలెత్తిపోతున్న గుత్తేదారులు:ఆస్తిపన్ను పెంపుతో భారీగా రాబడి వచ్చినా నగరాలు, పట్టణాల్లో ప్రజలకు కల్పించిన అదనపు సౌకర్యాలు అంతంత మాత్రమే. పాత బకాయిలతో కలిపి 2020-21 ఆస్తి పన్ను వార్షిక డిమాండు 2,945 కోట్లు ఉంటే 2023-24 నాటికి అదే డిమాండ్‌ 3,900 కోట్లకు చేరింది. అంటే 955 కోట్ల ఆదాయం అదనంగా పెరిగింది. అయితే ఈ స్థాయిలో పట్టణాల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారా అంటే అదీలేదు. ఎందుకంటే సాక్షాత్తు అధికార పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లే తమ వార్డుల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఆందోళనకు దిగుతున్నారు.

పీడీ ఖాతాలను సీఎఫ్​ఎంఎస్​కు అనుసంధానించడంతో ఆయా ఖాతాల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు మళ్లిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పుర, నగరపాలక, నగర పంచాయతీల ఖాతాల్లో నిధులు కనిపిస్తున్నా బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. అత్యవసరమైనవి తప్పితే మిగతా వాటిని ఆర్థికశాఖ పక్కన పెడుతోంది. దీంతో పట్టణ స్థానిక సంస్థల్లో పనులంటేనే గుత్తేదారులు హడలి పోతున్నారు. గుంటూరు, ఒంగోలు, విజయవాడ, అనంతపురం నగరపాలక సంస్థల్లో పాత బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేయడానికి గుత్తేదారులు టెండర్లు కూడా వేయడం లేదు.

డ్రెడ్జింగ్‌ యంత్రాలతో జల వనరులను తోడేస్తున్న దోపిడీదారులు - వైసీపీ పెద్దల అండతోనే దోపిడీ

కొత్త విధానం ప్రకారమే ఆస్తిపన్ను వసూలు:జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి మూలధన విలువ ఆధారంగా విధించే పన్నుతో కొత్తగా ఇళ్లు నిర్మించాలనుకుంటున్నవారు హడలిపోతున్నారు. వారికి పాత పన్ను లేదు కాబట్టి ఏటా 15 శాతం పెంపుదల వర్తించదు. రిజిస్ట్రేషన్ల శాఖ విలువ ప్రకారం నిర్ణయించిన పూర్తి పన్నును ఏటా చెల్లించాల్సిందే. ఇళ్లు, భవనాల నిర్మాణ ప్రాంతం ఆధారంగా విధిస్తున్న ఆస్తి పన్ను వేలు, లక్షల్లో ఉంటోంది. నగరీకరణ ఎక్కువగా జరుగుతున్న విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ప్రజలపై ఎక్కువ ప్రభావం ఉంటోంది. ఇప్పటికే ఇల్లు ఉన్నవారు అదనంగా మరో అంతస్తు వేసుకున్నా మేడపైన ఒక గది నిర్మించుకున్నా కొత్త విధానం ప్రకారమే ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు.

Last Updated : Dec 24, 2023, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details