కొన్నేళ్లుగా చేనేత, జౌళి పరిశ్రమలను కష్ట, నష్టాలు వెంటాడుతున్నాయి. విదేశీ వాణిజ్య పరిణామాలకు తోడు నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు వంటి పరిణామాలు పత్తి ఆధారిత పరిశ్రమలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా విలువ ఆధారిత ఉత్పత్తులు కాకుండా..... దారం ఉత్పత్తికే ఎక్కువ మిల్లులు పరిమితం కావడం నష్టాలకు దోహదం చేశాయి. పత్తి నుంచి దారం తీసే మిల్లులు దినదినగండంగా నడుస్తున్నాయి.
ప్రోత్సహాకాల కోసం ఎదురుచూపులు!
రాష్ట్రంలో 124 స్పిన్నింగు, 260 జిన్నింగ్, 11 పత్తి నుంచి నూనె తీసే మిల్లులున్నాయి. ఈ మిల్లుల ద్వారా రాష్ట్రంలో ఏడాదికి 20 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నుల బేల్స్ ఉత్పత్తి చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి ఎగుమతి చేసేవి 10 నుంచి 15 లక్షల టన్నులే. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమ ద్వారా 4 లక్షల 25 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. నాణ్యమైన దారం, నిరంతర విద్యుత్, అందుబాటులో నౌకాశ్రయాలు... రాష్ట్రంలో చేనేత, జౌళీ పరిశ్రమలకు అనువుగా ఉన్నాయి.
ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ మూడేళ్లుగా పరిశ్రమలు నష్టాలతో సతమతమవుతున్నాయి. మారిన ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, నోట్ల రద్దు, జీఎస్టీ, రైతులకు మద్ధతు ధర పెంపు వంటి అంశాలు.... స్పిన్నింగు, జిన్నింగు మిల్లుల భవిష్యత్తును ప్రభావితం చేశాయని చెబుతున్నారు మిల్లుల యజమానులు. మిల్లుల్ని గట్టిక్కేంచేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని వీరు కోరుతున్నారు.