గుంటూరులో వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడినుంచో పని కోసం వచ్చారు. దొరికిన పని చేసుకుంటూ ఇన్నాళ్లూ కడుపు నింపుకొన్నారు. ఉత్తరాంధ్ర, ఒడిశా, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల నుంచి వచ్చిన వీరికి... లాక్‌డౌన్ శరాఘాతంగా మారింది. ఆహారం, తాగునీరు, వసతి లేక.. రహదారులనే అశ్రయిస్తున్నారు. ఎవరైనా దాతలు కాసింత తిండి తీసుకొస్తే వారి వద్దకు పరుగులు పెడుతున్నారు.
షెల్టర్లలో కొందరికి ప్రభుత్వం వసతి కల్పించినా.. మిగతావారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పుడప్పుడూ కొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఆహారమే వారికి కడుపు నింపుతోంది. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఆహారం, తినుబండారాలపైనా ఆంక్షల విధింపుతో... అన్నార్తుల ఆవేదన దయనీయంగా మారింది. రహదారుల పక్కన కనిపిస్తే పోలీసుల బెదిరింపులూ తోడయ్యాయి. ఎక్కడ ఉండాలి... ఈ గండం ఎలా గట్టెక్కాలో అర్థం కాని పరిస్థితి.