ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గందరగోళంగా సాగుతున్న భూముల రీసర్వే - farmers facing problems with govt land survey

Land Resurvey : వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం' రాష్ట్రంలో అస్తవ్యస్తంగా సాగుతోంది. రైతుల సమస్యలకు పరిష్కారం చూపకపోగా.. కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. కొందరు రైతులు భూములు కోల్పోయి పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్నిచోట్ల రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో రైతులను భాగస్వాములను చేయకుండానే రీసర్వే పూర్తయినట్లు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. త్వరత్వరగా పని పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

Land Resurvey
భూ రీసర్వే

By

Published : Jan 7, 2023, 3:36 PM IST

Land Resurvey : రాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా సమస్యలను పరిష్కరించి రైతులకు శాశ్వత పత్రాలు అందించేందుకే 'వైఎస్‌ఆర్‌- జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం' తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్‌ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. రీసర్వేతో గ్రామాల్లో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు రైతులు భూములు కోల్పోయారు. దశాబ్దాల నుంచి సాగుచేసుకుంటున్న భూమి విస్తీర్ణం పట్టాదారు పాసు పుస్తకాల్లో ఎందుకు తగ్గిందో రెవెన్యూ సిబ్బంది చెప్పడం లేదు. కొన్నిచోట్ల రైతులను భాగస్వాములను చేయకుండానే రీసర్వే పూర్తయినట్లు ప్రకటించేశారు. న్యాయం చేయాలని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

వైఎస్‌ఆర్‌ జగనన్న భూహక్కు- భూరక్ష పథకం అస్తవ్యస్థం

రీసర్వే కారణంగా భూ వివాదాలు పరిష్కారం కాకపోగా... ఉన్న వాటికి మించి కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. తగ్గిన భూమి విస్తీర్ణంపై రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నా.... అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా రీసర్వే పూర్తయినట్లు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇలాంటి వారు 10 నుంచి 15 శాతం వరకు ఉంటున్నారు. రికార్డుల్లో ఉన్న వివరాలకు తగ్గట్లు భూములకు రక్షణ లేకుండాపోతోంది. వారసత్వంగా వచ్చిన ఆస్తులకు YSR జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం' పేరుతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయడమేంటని రైతులు అధికారులను నిలదీస్తున్నారు.

తొలివిడత చేపట్టిన రీసర్వే 2వేల గ్రామాల్లో పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రీసర్వేలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి వచ్చిన 19వేల అభ్యర్థనలు పరిష్కరించినట్లు గొప్పగా చెప్పింది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో రీసర్వే పూర్తయిన ఒక్కో గ్రామాన్ని ఈటీవీ-ఈనాడు ప్రతినిధులు సందర్శించి రైతులను కలిశారు. అన్నిచోట్లా రైతులు సమస్యలను ఏకరవు పెట్టారు. రీసర్వేలో భూమి ఎందుకు తగ్గిందో అధికారులు చెప్పడం లేదు. మరోసారి దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో ఎడిట్ ఆప్షన్ వస్తుందని... వీఆర్వోలు, తహసీల్దార్లు, సర్వేయర్లు చెబుతున్నారు.

పట్టాదారు పాసు పుస్తకాలు సిద్ధమైన తర్వాత తమ అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకుంటారో? లేదో అర్థం కావడంలేదని... అంతా అయోమయంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడి కారణంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో భూముల నిర్ధారణ చేయకుండా రీసర్వే పూర్తయినట్లు ప్రకటించారు. అధికారుల ఒత్తిళ్లతో పూర్వ రికార్డుల్లోని సమాచారాన్ని యధాతథంగా కొత్త రికార్డుల్లో రాత్రికిరాత్రే నమోదు చేయడం ఇటీవల సంచలనం సృష్టించింది. తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు గగ్గోలు పెట్టడంతో ఇప్పుడు కొలతలు వేస్తున్నారు.

కొందరు అనధికారికంగా డీకేటీ భూములను కొనుగోలు చేసి ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఈ భూములు నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. ఆధారాలు చూపించి వాటిని విడిపించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంటూ వాటిని పక్కన పెడుతున్నారు. ఈ కేటగిరిలో ఇప్పటివరకు లక్ష వరకు దరఖాస్తులు వచ్చాయి. కొందరు సాదా బైనామా డీడ్ ద్వారా భూములు కొనుగోలు చేసినా ఆన్‌లైన్‌లో మాత్రం వారి పేరు నమోదు కాలేదు. ఎప్పటి నుంచో పాత వ్యక్తుల పేరుతోనే రికార్డుల్లో కొనసాగుతూ వస్తున్నాయి. వీటి కోసం కూడా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ భూములను యజమానుల నిర్ధారణ జరిగిన తర్వాతే వీరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నారు.

ప్రస్తుతం రీసర్వే జరుగుతున్న రెండువేల గ్రామాల్లో మొత్తం ప్రక్రియ పూర్తిచేసి ఫిబ్రవరిలో భూహక్కు పత్రాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖను ఆదేశించింది. 90 రోజుల్లోగా ఇది పూర్తి చేయాలని రెవెన్యూ ఉద్యోగులు, సర్వేయర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. తొలుత 180 రోజులు ప్రణాళిక రూపొందించారు. రోవర్లు కూడా అవసరాలకు తగ్గట్లు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. రీసర్వేలో గ్రామ సర్వేయరు, గ్రామ రెవెన్యూ అధికారులది కీలకపాత్ర. అయితే చాలాచోట్ల గ్రామ సర్వేయర్‌పై భారం ఎక్కువగా ఉంటోంది. రెవెన్యూ సిబ్బందికి, వీరికి మధ్య కొన్నిచోట్ల సమన్వయం ఉండడం లేదు. రీసర్వే నిర్వహణకు సంబంధించి గ్రామాల్లో అయ్యే ఖర్చులను కొన్నిచోట్ల వీఆర్వోలు భరిస్తున్నారు.

ప్రత్యేక బృందం లేకపోవడంతో రెగ్యులర్ పనులతోపాటు రీసర్వే చేయాల్సి రావడం ఉద్యోగులకు అవరోధంగా ఉంది. మరోవంక రైతుల సందేహాలను క్షేత్రస్థాయిలో నివృత్తి చేసి..., భూమిపై ఉన్న అనుభవ విస్తీర్ణానికి, రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి తేడాలను సరిచేసి..., అందుకు గల కారణాలను వివరించే వెసులుబాటు, అనుభవం, సమయం అధికారులకు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అలాగే కంప్యూటర్లు, ఇతర మౌలిక వసతులు అవసరాలకు తగ్గట్లు అందుబాటులో లేవు. అభ్యంతరాలు తెలియజేస్తే విచారించేందుకు మొబైల్ మేజిస్ట్రేట్ కింద డిప్యూటీ తహసీల్దార్లకు అధికారాన్ని అప్పగించారు. కానీ ఈ పోస్టుల్లో చాలాచోట్ల అనుభవం లేనివారు ఉన్నారు. వీరు రైతుల అభ్యర్థనలు పరిష్కరించలేకపోతున్నారు. గ్రామాల్లో వెయ్యి ఎకరాలు ఉన్నా... నాలుగువేల ఎకరాలు ఉన్నా గడువు ఒకేలా ఉందని... తహసీల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లు తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు.

ప్రభుత్వ భూములైన డొంకలు, చెరువులు, కాలువలు, శ్మశానం మొదలైన వాటిని గుర్తించి సరిహద్దులు కొలిచి నిర్ధారించుకుని రాళ్లు పాతాలి. అయితే రాళ్లు లేక సర్వే చేసి గుర్తులు పెట్టి తర్వాత నాటడం వల్ల సమస్యలు వస్తున్నాయి. డ్రోన్లతో చిత్రాలు తీసి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ తయారుచేస్తారు. ప్రైవేటు ఏజెన్సీలు చేస్తున్నవి పలుచోట్ల నాణ్యంగా ఉండడం లేదని సర్వే సిబ్బంది చెబుతున్నారు. వీటి ఆధారంగా భూమిపైన రైతు పొలాల సరిహద్దులు గుర్తించడం కష్టమవుతోందని పేర్కొంటున్నారు. డ్రోన్ ద్వారా తీసిన చిత్రం ఆధారంగా రోవర్‌తో ప్రతి పొలం కొలిచి హద్దులు నిర్ధారిస్తే సమస్యలు రావు. కానీ డ్రోన్ చిత్రంలో కనపడని చెట్లు, ఇతర ప్రదేశాలు, ప్రభుత్వ భూములు మాత్రమే రోవర్లతో కొలిచి హద్దులు నిర్ణయిస్తున్నారు. సమయం తక్కువ ఉన్నందున అన్నీ భూములను రోవర్‌తో కొలిచి హద్దులు నిర్ణయించలేని పరిస్థితులు నెలకొన్నాయి.

రీసర్వే తర్వాత పక్కపక్కనే పొలాలు ఉన్న ఇద్దరు రైతుల మధ్య విస్తీర్ణంలో తేడాలు వచ్చినప్పుడు వాటిని సరిదిద్దకుండానే హక్కు పత్రాలు ఇస్తున్నారు. రైతులు ప్రశ్నిస్తే పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాక మళ్లీ సర్వేకు పెట్టుకుంటే అప్పుడు సరిచేస్తామని చెబుతూ తప్పించుకునేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ఇద్దరు రైతులూ ఒప్పుకుంటేనే విస్తీర్ణాలు సరిచేస్తున్నారు. ఒకరు ఒప్పుకోకపోతే నిర్ణయం తీసుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. కుంటలు, కాలువలకు అనేక ప్రాంతాల్లో గతంలో పట్టాలిచ్చారు. రికార్డుల్లో ఆ భూమి స్వభావాన్ని మార్చాల్సి ఉంది. కాలువ పోరంబోకు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చాలి. అనేకచోట్ల ఎక్కడా రికార్డులు లేకుండానే పట్టాలు ఇచ్చేశారు. ఇప్పుడు వాటికి భూహక్కు ఎలా కల్పించాలనేది స్పష్టత లేదు. క్షేత్రస్థాయిలో అధికారులకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. రికార్డుల ప్రకారం ఉన్న విస్తీర్ణం భూమిపైకి వెళ్లినప్పుడు కొన్నిచోట్ల తక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నవారు ఆక్రమిస్తున్నారు. దీంతో ముందుగా వివాదం లేని భూమికి క్లియరెన్స్ ఇచ్చి మిగిలింది మాత్రం పక్కన పెడుతున్నారు.

రీసర్వే పూర్తయిన గ్రామాల్లో స్థల విస్తీర్ణం తగ్గుదలపై చేస్తున్న అభ్యర్థనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందో, లేదో తెలియక రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రీసర్వే పూర్తయినట్లు ప్రకటించిన గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది... దరఖాస్తులిస్తే చూస్తామని చెబుతున్నారే కానీ.. ఎప్పటిలోగా పరిష్కరిస్తారో తెలియడం లేదని రైతులు పేర్కొంటున్నారు. కొత్తగా ముద్రించిన భూహక్కు పత్రాలను గత అక్టోబరు 2న రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ వాటిలో ముద్రించిన వివరాల్లో భారీగా తప్పులు దొర్లాయి. దీంతో వీటిని సవరించేందుకు జిల్లాల్లో పెద్ద కసరత్తు జరిగింది. నవంబరు రెండో వారం వరకు సమయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గత నెల 23న సీఎం పుస్తకాల పంపిణీ ప్రారంభించాక జిల్లాల వారీగా పంపిణీ ప్రారంభమైంది. కానీ ఈ పుస్తకాల్లో పేర్కొన్న వివరాల్లో దొర్లిన తప్పులు అన్నీఇన్నీ కావు. 7.86 లక్షల పుస్తకాలు సిద్ధం చేయగా 47వేల మంది రైతుల ఫొటోలు అదృశ్యమయ్యాయి. 23వేల పుస్తకాల్లో పూర్వ సర్వే నంబర్లు వచ్చాయి. 16వేల మంది రైతుల విస్తీర్ణాల్లో వ్యత్యాసాలు కనిపించాయి. 42వేల పుస్తకాల్లో ఖాతా నంబర్లలో తప్పులు వచ్చాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details