ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ramagundam: తెలంగాణకు కల్పతరువు.. రామగుండం ఎరువు.. దీని ప్రత్యేకతలివే! - ఏపీలో యూరియా ఉత్పత్తి

Ramagundam Fertilizer Factory: రామగుండం ఎరువుల కర్మాగారం తెలంగాణ వ్యవసాయ రంగానికి కల్పతరువుగా ఆవిర్భవించింది. రాష్ట్రంలో యూరియాను ఉత్పత్తి చేసే ఏకైక పరిశ్రమను జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 12న పెద్దపల్లి జిల్లా రామగుండం రానున్న నేపథ్యంలో సంస్థ ప్రస్థానంపై ప్రత్యేక కథనం..

Ramagundam Fertilizer
Ramagundam Fertilizer

By

Published : Nov 10, 2022, 9:58 AM IST

Ramagundam Fertilizer Factory: ఒకప్పుడు ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా ఇక్కడ యూరియా ఉత్పత్తి చేశారు. నష్టాలు రావడంతో 1999 మార్చి 31న ఆ పరిశ్రమను మూసివేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తిరిగి రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)గా అది కొత్త రూపు సంతరించుకుంది.

అప్పట్లో బొగ్గు ఆధారంగా ఉత్పత్తి జరగగా, ఇప్పుడు గ్యాస్‌ సహకారంతో ప్లాంటు నడిచేలా నిర్మించారు. ఏపీలోని మల్లవరం నుంచి పైప్‌లైన్‌ ద్వారా సహజ వాయువును సరఫరా చేస్తున్నారు. పరిశ్రమలో యూరియాతో పాటు అమ్మోనియా కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడికి అవసరమైన 0.50 టీఎంసీల నీటిని సమీపంలోని ఎల్లంపల్లి శ్రీపాదసాగర్‌ నుంచి అందిస్తున్నారు.

వెయ్యి ఎకరాల్లో నిర్మాణం:ప్రతి రోజూ 2,200 టన్నుల అమ్మోనియా 3,850 టన్నుల యూరియా తయారీ సామర్థ్యంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను 1000 ఎకరాల్లో నిర్మించారు. ఉత్పత్తి అవుతున్న ఎరువులో సగాన్ని తెలంగాణ ప్రాంతానికే సరఫరా చేస్తున్నారు. ఏటా 12.75 లక్షల మెట్రిక్‌ టన్నులు అందించేలా ఇది ఏర్పాటైంది. వేప నూనె మిశ్రమంతో కలిపి వెలువడే యూరియాను కిసాన్‌ బ్రాండ్‌ పేరిట మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.

పరిశ్రమ ప్రత్యేకతలు ఇవీ..

  • రూ.6,338.16 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 2021 నుంచి ఇప్పటివరకు ఉత్పత్తయిన యూరియా 10.17 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా ఇప్పటివరకు సంస్థ రూ.67 కోట్లు ఆర్జించింది. ప్రభుత్వం అధికారికంగా ఉత్పత్తి చేసిన ఎరువులను మొదట తెలంగాణ అవసరాలు తీర్చాకే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించారు.
  • ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 11 శాతం. రూ.160 కోట్లకు పైగా ఈక్విటీగా చెల్లించి షేర్లు పొందింది. అంతేకాకుండా రూ.80 కోట్లతో మిషన్‌ భగీరథ తాగునీటి పైపులైను వేయించింది. పరిశ్రమ విద్యుత్తు అవసరాల కోసం టీఎస్‌ఐపాస్‌లో భాగంగా యూనిట్‌కు రూపాయి చొప్పున రాయితీ ఇచ్చింది. రూ.14 కోట్లతో విద్యుత్తు లైన్లు, రహదారులు నిర్మించింది. గతేడాది సెప్టెంబరు 12న కేంద్ర మంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, కిషన్‌రెడ్డిలు కర్మాగారాన్ని సందర్శించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు పరిశ్రమ ప్రగతిపై పలుమార్లు సమీక్షించారు.
  • కిసాన్‌ బ్రాండ్‌ యూరియా బస్తా బరువు 45 కిలోలు. దీని తయారీకి రూ.1,500 ఖర్చవుతుండగా రాయితీ పోగా ధరను రూ.266.50గా నిర్ణయించారు. దీనిలో 46.0 శాతం నైట్రోజన్‌ ఉండటం వల్ల భూసారం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రస్థానం..

2015 ఫిబ్రవరి 17న పనులు ప్రారంభం.
2016 ఆగస్టు 7న వర్చువల్‌ పద్ధతిలో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నుంచి ప్రధాని మోదీ శంకుస్థాపన.
2016 ఆగస్టు 8న సహజవాయువు సరఫరాకు జీఎస్‌పీఎల్‌తో ఒప్పందం.
2018 ఆగస్టు 18న భాగస్వాముల మధ్య ఒప్పందం.
2019 మార్చి 30న 220 కేవీ స్విచ్‌యార్డు నుంచి విద్యుత్తు సరఫరా.
2020 జులై 7న గ్యాస్‌ టర్బైన్‌ జనరేటర్‌ ప్రారంభం.
2021 మార్చి 22న యూరియా ఉత్పత్తి ప్రారంభం.

పరిశ్రమలో భాగస్వామ్య సంస్థలు



ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details