గుంటూరు జిల్లాలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఈనెల 19న పదోన్నతులు కల్పించనున్నారు. జాబితాను రూపొందించి జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. శనివారం ఒక్కరోజే ఉపాధ్యాయులను అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. నిర్దేశిత గడువు ముగిసే సమయానికి 60 మంది అభ్యంతరాలు తెలియజేశారు. వాటిపై జిల్లా విద్యాశాఖ తిరిగి పరిశీలన జరిపి శనివారం రాత్రికల్లా కొత్త జాబితా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల నుంచి భిన్నమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
1997లో జాయినింగ్ అయిన వారికి పదోన్నతి కల్పించి 96లో జాయినింగ్ అయిన పలువురికి ఎందుకు నిరాకరించారని ఉపాధ్యాయుడొకరు అభ్యంతరం లేవనెత్తారు. బీఈడీలో సింగిల్ మెథడాలజీ చేసిన వారికి పదోన్నతుల జాబితాలో స్థానం లేకపోవటాన్ని ఓ ఉపాధ్యాయ సంఘం నేత ప్రశ్నించారు. నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న వారి ఖాళీలను తొలుత జాబితాలో చూపుతామన్నారు.
ఆ పోస్టులను ప్రస్తుతం భర్తీ చేస్తారా? కౌన్సెలింగ్ బదిలీలు అయ్యాక భర్తీ చేస్తారా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు కోరినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పదోన్నతుల జాబితాలో గ్రేడ్-1 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్‌తో సమానంగా భావించే ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు ఖాళీలను పేర్కొన్నారు.
250 మందికి పదోన్నతులు..