గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని బాలాజీ నర్సింగ్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ గర్భిణీ మృతి చెందింది. నూజెండ్ల మండలం అయినవోలు గ్రామానికి చెందిన పోగుల కోటేశ్వరరావు.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పీఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని భార్య సుబ్బలక్ష్మి ఈపూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. తొమ్మిది నెలల గర్భవతైన సుబ్బలక్ష్మి కాన్పు కోసం గురువారం రాత్రి పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్‌కు కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. నొప్పులతో బాధపడుతున్న ఆమెకి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి వైద్యం అందిస్తుండగా.. పరిస్థితి విషమించింది. ఆమెను హడావుడిగా నరసరావుపేటకు తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందిందని నరసరావుపేట వైద్యులు తెలిపారు.
అర్హతలేని వైద్యుడు సిబ్బంది చికిత్స అందించడం వల్లనే.. సుబ్బలక్ష్మి మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. బంధువులు ఉదయం బాలాజీ నర్సింగ్ హోం వద్ద ఆందోళనకు దిగారు. హాస్పిటల్‌ను సీజ్ చేయాలంటూ అఖిలపక్ష నాయకులు నినాదాలు చేశారు. గతంలో ఈ ఆసుపత్రిలో అనేకమంది రోగులకు వైద్యం వికటించి మృతి చెందారని నేతలు అన్నారు. పట్టణ సీఐ చిన్న మల్లయ్య, ఎస్ఐ వెంకట్రావు పోలీసులు సర్దిచెప్పడంతో.. వారు ఆందోళన విరమించారు.