కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా గ్రామాల సరిహద్దుల్లో వేస్తున్న ముళ్ల కంచెలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం పుట్టకోటకు చెందిన ఓ మహిళకు అర్ధరాత్రి వేళ పురిటినొప్పులు రాగా.. కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. 108 సిబ్బంది హుటాహుటిన బయలుదేరినా.. సరిహద్దులు మూసేసిన కారణంగా ఊరిలోకి రావటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దారి మళ్లించే ప్రయత్నంలో బురదమట్టిలో వాహనం కూరుకుపోయింది. ఈ లోపు మహిళకు పురిటినొప్పులు ఎక్కువై ఇంట్లోనే బిడ్డకి జన్మనిచ్చింది. మహిళ కుటుంబసభ్యులు స్థానికుల సాయంతో.. ఆటోలో అంబులెన్సు వరకు తల్లీబిడ్డలను చేర్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. సరిహద్దుల వద్ద కంచె వేయటం వల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బందిగా ఉంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.