రాష్ట్రంలో ఆన్‌లైన్ కొనుగోళ్లలో విజయవాడ, గుంటూరు వాసులు ముందుంటున్నారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలోను, పాత వస్తువులు అమ్మే సైట్లలో రోజూ వేల సంఖ్యలో ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. కొవిడ్ నేపథ్యంలో ఇవి మరింత పెరిగాయి. దీనికి తగ్గట్టుగానే మోసాలు కూడా ఎక్కువయ్యాయి. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు.. ఒక్కోసారి ఒకదాని బదులు మరొకటి రావడం, పగిలిపోవడం, పాడైపోవడం, నాణ్యత సరిగా లేకపోవడం, ఖాళీ బాక్సులు ఇంటికి చేరడం.. ఇలా అనేకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డబ్బులు చెల్లించడానికి డెబిట్, క్రెడిట్ కార్డులు వినియోగిస్తే.. ఆ వివరాలను అక్రమార్కులు తస్కరిస్తున్నారు. గుంటూరు జిల్లాలో గడచిన మూడేళ్లలో 405 సైబర్ నేరాలపై ఫిర్యాదులు నమోదవడం గమనార్హం. విజయవాడ, గుంటూరు నగరాల్లో కొవిడ్‌కు ముందు నిత్యం మూడు నుంచి నాలుగు వేల వస్తువులు ఆన్‌లైన్‌లో బుక్ చేసినవి వినియోగదారులకు వస్తుండేవి. ప్రస్తుతం రోజుకు ఐదు వేల వరకు వస్తున్నట్టు అంచనా. డైపర్స్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్, దుస్తులు, గృహోపకరణాల వరకు అన్నీ ప్రముఖ ఈ కామర్స్ సంస్థల నుంచి ప్రజలు కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక వస్తువు బుక్ చేసిన దగ్గర నుంచి డబ్బులు చెల్లించడం, ఇంటికి చేరాక తీసుకోవడం వరకూ.. ప్రతిదశలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్‌క్రైం నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గుంటూరుకు చెందిన ప్రకాష్ ఆన్‌లైన్‌లో రూ.30 వేలు చెల్లించి ల్యాప్‌టాప్ బుక్ చేశారు. పార్శిల్ వచ్చిన తర్వాత తెరిచి చూస్తే రూ.1500 విలువ చేసే చైనా ఫోన్ ఉండడంతో అవాక్కయ్యారు. ఆన్‌లైన్‌లో వెతికితే ఆయన బుక్ చేసిన వైబ్‌సైట్ తొలగించినట్లు తేలడంతో పోలీసులను ఆశ్రయించారు.
నెహ్రూనగర్‌కు చెందిన రవితేజ చరవాణి వాట్సాప్‌నకు ఓ వ్యక్తి తాను ఆర్మీ ఉద్యోగినంటూ గుర్తింపు కార్డు, ఫొటో పెట్టాడు. తన కొత్త ద్విచక్రవాహనం తక్కువ ధరకు అమ్ముతున్నానని రూ.40 వేలు జమ చేయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత రైలులో పార్శిల్ చేశానని, మరో రూ.10 వేలు ఇవ్వాలన్నాడు. అలా రూ.లక్ష వసూలు చేసుకొని ఫోన్ సిమ్‌కార్డు మార్చేశాడు. విచారిస్తే నకిలీ గుర్తింపు కార్డుతో మోసగించినట్లు తేలింది.
పాత వస్తువులు కొనాలన్నా..
పాత వస్తువుల కొనుగోళ్లలోనూ విజయవాడ, గుంటూరు నగరవాసులు ముందంజలో ఉన్నారు. వీటిని కొనుగోలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ నుంచి బైకు, కార్ల వరకు ఏది కావాలన్నా.. కచ్చితంగా సరైన పేపర్లు, బిల్లులు ఉంటేనే తీసుకోవాలి. ఇటీవల దొంగ సరకు విక్రయానికి ఇలాంటి వెబ్‌సైట్లనే చోరులు వినియోగించుకుంటున్నారు.
వస్తువుల ఎంపిక
సెల్‌ఫోన్ దగ్గర నుంచి పిల్లల ఆటవస్తువులు, దుస్తులు, గృహోపకరణాల వరకు ఏది కొనాలని చూసినా.. వందలు.. వేల సంఖ్యలో ఉత్పత్తులు కనిపిస్తుంటాయి. వీటిలో నాణ్యత లేనివీ ఉంటాయి. అందుకే ఏ వస్తువుకైనా ఇంతకుముందు కొన్నవాళ్లు ఇచ్చిన రేటింగ్స్, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. రాయితీలు అధికంగా ఉన్నాయని కొనుగోలు చేస్తే.. వాటి నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. అందుకే.. తోటి వినియోగదారుల సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.
డబ్బులు చెల్లించడం..
ఆన్‌లైన్‌లో ఏ వస్తువుకైనా ముందుగా డబ్బులు చెల్లించి వస్తువు తెప్పించుకోవడం ఒక పద్ధతి. వస్తువు ఇంటికి వచ్చాక చెల్లించడం మరో పద్ధతి. దీనిలో రెండో విధానం ఎంచుకోవడమే ఉత్తమం. ప్రముఖ ఈ కామర్స్ ఉత్పత్తుల సంస్థలతో అయితే ఇబ్బంది ఉండదు. ఇటీవల కొన్ని నకిలీ సంస్థలు పుట్టుకొచ్చాయి. అతి తక్కువ ధరకే ఉత్పత్తులు ఇస్తామంటూ ఆకర్షణీయ ప్రకటనలు ఇచ్చి.. ముందుగా డబ్బులు కట్టించుకుని.. మోసం చేస్తున్నాయి.