Prashant Kishor Met Chandrababu :రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అధికార వైఎస్సార్సీపీకి షాకిస్తూ ఆపార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పంచన చేరారు. ఎన్నికల వ్యూహాలు రచించడంలో దేశంలోనే తిరుగులేనివాడిగా పేరున్న పీకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కృషి చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు 3గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో లోకేశ్‌తోపాటు ప్రస్తుతం తెలుగుదేశం వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్‌శర్మ కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ ఒకప్పుడు ఐప్యాక్‌లో సహచరులే. వచ్చే ఎన్నికల్లో రాబిన్‌శర్మ, పీకే బృందాలు పరస్పర సహకారంతో తెలుగుదేశాన్ని గెలిపించేందుకు పనిచేయనున్నట్లు సమాచారం. పీకే బృందం రెండు, మూడు నెలల నుంచే తెలుగుదేశం కోసం పనిచేయడం ప్రారంభించింది.
Chandrababu Meeting with Election Strategist PK :గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావడం వెనక పీకే చాలా కీలకంగా వ్యవహించారు. తాను పనిచేస్తున్న పార్టీ విజయం కోసం ఆయన ఎంతవరకైనా వెళ్తారని ఎలాంటి వ్యూహాలైనా రచిస్తారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు, అతి త్వరలోనే చెడ్డపేరు తెచ్చుకోవడం చూసి ఆయన అంతర్మథనానికి గురయ్యేవారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ‘ఇలాంటి పార్టీ గెలుపు కోసమా నేను పనిచేసింది?’ అని ఆయన చాలాసార్లు ఆవేదన చెందినట్లు తెలిసింది.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్! టార్గెట్ 2024!!
Election strategist PK Work With CBN For 2024 Elections :జగన్ ప్రభుత్వ విధానాలను సైతం ఆయన ఒకటి, రెండుసార్లు బహిరంగ వేదికలపైనే పరోక్షంగా విమర్శించారు. గతంలో తమిళనాడు, పంజాబ్, బిహార్, పశ్చిమబెంగాల్, దిల్లీలో వివిధ పార్టీల కోసం పనిచేసిన పీకేలో గతంలో తాను అధికారంలోకి తెచ్చిన ఏ పార్టీ ప్రభుత్వమూ ఇంతగా చెడ్డపేరు మూటగట్టుకోలేదన్న భావన చాలా బలంగా ఉన్నట్టు సమాచారం. వైఎస్సార్సీపీ వంటి విధ్వంసకర పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశానని ఆయన మథనపడుతున్నట్టు సమాచారం. దాన్ని సరిదిద్దుకోవడానికే తెలుగుదేశంతో పనిచేయాలని నిర్ణయించుకున్నారా లేక మునిగే పడవను వదిలేసి గెలుపు గుర్రంవైపు చేరారా.. అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.