గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ప్రభలు నిర్మించి కోటప్పకొండకు తీసుకెళుతున్నారు. వీటి నిర్మాణం వెనుక ఆయా గ్రామాల ప్రజల కష్టం అంతాఇంతా కాదు. మిరిమిట్లు గొలిపే వెలుగు జిలుగుల్లో కాంతులీనుతూ కరెంటు ప్రబల ప్రత్యేకత ఎప్పటికీ భక్తుల హృదయాల్లో నిలిచిపోతూనే ఉంది.
గుంటూరు జిల్లా కోటప్పకొండ జాతరలో ప్రభలు కోటప్పకొండ జాతరలో చిలకలూరిపేట ప్రభలదే ప్రత్యేకత
కోటొక్క ప్రభ కడితే కోటయ్య కొండ దిగి వస్తాడని.. చిలకలూరిపేట వాసుల విశ్వాసం. ఈ నమ్మకమే దశాబ్దాలుగా ప్రభల నిర్మాణంలో.. వారిని పాలు పంచుకునేలా చేస్తోంది. మహాశివరాత్రి రోజు కోటప్పకొండ వద్ద చిలకలూరిపేట ప్రాంతం నుంచి వచ్చే ప్రభలదే వైభవం.
నెల రోజుల ముందు నుంచే ప్రభల పనులు
కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలు తరలించాలంటే.. నెల రోజుల ముందు నుంచే ప్రభలు నిర్మించే గ్రామాలైన కావూరు, కమ్మవారిపాలెం, అమీన్ సాహెబ్ పాలెం, అప్పాపురం, మద్దిరాల, యడవల్లి, బొప్పూడి, పురుషోత్తమ పట్నం గ్రామాలలో సందడి మొదలవుతుంది. ముందుగా ప్రభలను తరలించేందుకు బండిని తయారు చేస్తారు. దీనికోసం ఇరుసు, చక్రాలు సిద్ధం చేస్తారు. అనంతరం ప్రభ నిర్మాణానికి కొత్తగా తోటలోకి వెళ్లి 90 అడుగుల పొడవున్న సరివి కర్రలను, పెండెం లను సిద్ధం చేస్తారు. వాటిని గ్రామస్తులే తాళ్లతో కట్టి అవి గట్టిగా ఉండేలా బిగిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి 20 రోజులు పడుతుంది. అనంతరం ప్రభను అలంకరిస్తారు. తిరునాళ్లకు మూడు రోజుల ముందు ప్రభలను లేపి నిలుపుతారు.
ఒక్కొక్క ప్రభ కు రూ.25 నుంచి రూ.30 లక్షల ఖర్చు
కోటప్పకొండకు తరలించే ఒక్కొక్క విద్యుత్ ప్రభ నిర్మాణానికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనికోసం గ్రామంలో రైతులకు ఉన్న పొలాల వారీగా చందాను వేస్తారు. ఎకరాకు రైతు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభకు సంబంధించి విద్యుత్ అలంకరణకు రూ.10 నుంచి 12 లక్షలు, కర్రలు తాళ్లు అలంకరణ ఖర్చు రూ.5 లక్షలు, అన్నదానానికి రూ.5 లక్షలు.. ప్రభను తరలించేందుకు, తిరిగి గ్రామానికి జాగ్రత్తగా తీసుకొచ్చి నందుకు రూ.2 లక్షలు.. ఇలా మొత్తం రూ.25 లక్షలకు పైనే ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అవుతున్నా.. కోటయ్య స్వామి మీద ఉన్న నమ్మకంతో వందల సంవత్సరాలుగా ప్రభలు కోటప్పకొండకు కట్టి చిలకలూరిపేట ప్రాంత ప్రజలు తరలిస్తూనే ఉన్నారు.
ప్రభల ప్రత్యేకత
చిలకలూరిపేట ప్రాంతం నుంచి కోటప్ప కొండకు తరలి వెళ్లే ప్రభలకు ప్రత్యేకత ఉంది. 300 సంవత్సరాల నుంచి చెక్క ప్రభతో కొండకి వెళ్ళిన కావూరు గ్రామస్తులు 1946 నుంచి క్రమం తప్పకుండా కరెంటు ప్రభను కట్టి తరలిస్తున్నారు. ఈ ఏడాదితో కావూరు కరెంటు ప్రభకు 76 వసంతాలు పూర్తి కానున్నాయి. ఈ ప్రభకు గ్రామంలో ప్రత్యేక గది ఉంది. కోటప్పకొండ వద్ద రాజావారు కావూరు ప్రభకు ప్రత్యేక స్థలం కేటాయించడంతో పాటు.. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శిలాఫలకం కూడా వేయించారు. ఎన్టీఆర్ తొలి మహానాడులో కావూరు ప్రభ ప్రశంసలు అందుకుంది. ఇలా కావూరు ప్రభకు ఎన్నో తీపి గుర్తులున్నాయి. గ్రామంలో ఉన్న ఇంటి పేరుతో ఆరు గ్రూపులుగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్క ఏడాది ఖర్చును పెట్టుకుంటారు. పనులు మాత్రం పార్టీలకు కులమతాలకు అతీతంగా ఐకమత్యంగా అందరూ కలిసే చేస్తారు.
ఒకే గ్రామం నుంచి తొమ్మిది ప్రభలు
చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం నుంచి 6 విద్యుత్ ప్రభలు, 3 సాధారణ ప్రభలు.. మొత్తం తొమ్మిది ప్రభలు ఈ ఒక్క గ్రామం నుంచి కొండకు బయలుదేరుతాయి. బైరా వారి ప్రభ, విడదల వారి ప్రభ, గ్రామ ప్రభ, తోట పుల్లప్ప తాతగారి ప్రభ, చిన్న తోట వారి ప్రభ, యాదవ రాజుల ప్రభలు విద్యుత్తు ప్రభలు. మండలనేనివారి ప్రభ, తోట కృష్ణమ్మ గారి ప్రభ, బ్రహ్మంగారి గుడి వీధి ప్రభలు సాధారణమైనవి. ఎక్కువ ప్రభలు నిర్మించే గ్రామంగా పురుషోత్తమపట్నంకు గుర్తింపు ఉంది. వందల ఏళ్లుగా చెక్క ప్రభలు తరలించిన గ్రామంగా పేరు ఉంది.
ఇనుప పైపులతో మద్దిరాల ప్రభ
మద్దిరాల ప్రభ 38 ఏళ్లుగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఇనుప పైపులతో ప్రభను నిర్మించారు. ప్రతిసారి మద్దిరాల ఏదో ఒక ప్రత్యేకతను చాటుతూనే ఉంది. కమ్మవారిపాలెం విద్యుత్ ప్రభ ను 15 ఏళ్లుగా క్రమం తప్పకుండా నిర్మిస్తున్నారు. ఎక్కువ ఎత్తులో నిర్మించే ప్రభ గుర్తింపు ఉంది. అప్పాపురం గ్రామస్తులంతా ఐక్యతగా గత 47 ఏళ్లుగా విద్యుత్ ప్రభను నిర్మించి కొండకు తరలిస్తున్నారు. అమీన్ సాహెబ్ పాలెం ప్రభను కూడా 50 ఏళ్లుగా నిర్మిస్తున్నారు. వీటితో పాటు పది సంవత్సరాలుగా నిర్మిస్తున్న యడవల్లి ప్రభ అలంకరణలో ప్రత్యేకతను చాటుకుంటోంది. చాలా కాలం తరువాత బొప్పూడిలో ఈ ఏడాది తిరిగి కొత్తగా విద్యుత్ ప్రవాహం నిర్మాణాన్ని చేపట్టారు.
ప్రభ పండుగ అనంతరం కొండకు బయలుదేరుతున్న ప్రభలు
ప్రభల నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామాలలో ఆదివారం రాత్రి పండుగను వైభవంగా నిర్వహించారు. ప్రభలు నిర్మిస్తున్న గ్రామాలకు చెందినవారు ఎక్కడ ఉన్నా సొంత ఊరికి చేరుకుంటారు. దీంతో సంక్రాంతి పెద్ద పండుగ లాగా గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. ప్రభ చుట్టూ గుమ్మడికాయలతో తిరిగి మొక్కులు చెల్లించుకున్న గ్రామస్తులు వారు పోస్తుండగా హర హర చేదుకో కోటయ్య అంటూ సోమవారం అన్ని ప్రభలు కోటయ్య సన్నిధికి చేరుకునేందుకు బయలుదేరాయి.
ఇదీ చదవండి:SHIVARATRI CELEBRATIONS: రాష్ట్రవ్యాప్తంగా ముస్తాబైన శివాలయాలు