ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 13, 2023, 7:16 AM IST

ETV Bharat / state

Power Bills Burden: కరెంటు షాక్​ కొట్టిన కాకుల్లా రాష్ట్ర ప్రజలు.. ఇదేం బాదుడన్నా అంటూ ఆవేదన

Power Shock to Normal People: విద్యుత్‌ వినియోగదారులను.. ప్రభుత్వం వీరబాదుడు బాదుతోంది. మే నెలలోనే... 3 రకాల అదనపు ఛార్జీలు వడ్డించింది. ఒక ట్రూప్‌, రెంటు సర్దుబాటు ఛార్జీలపేరుతో.. కోలుకోలేని షాక్ ఇచ్చింది. రకరకాల ఛార్జీలతో.. ఏటా 11వేల 270 కోట్ల రూపాయలమేర అదనంగా దండుకుంటోంది. వందల్లో వచ్చే బిల్లులు కాస్తా వేలల్లో వస్తుండడంతో.. వినియోగదారుల కరెంటు షాక్‌ కొట్టిన కాకుల్లా విలవిల్లాడుతున్నారు.

Power Shock to Normal People
Power Shock to Normal People

కరెంటు షాక్​ కొట్టిన కాకుల్లా రాష్ట్ర ప్రజలు

Power Shock to Normal People: 'కరెంట్‌ షాక్‌ కొట్టిన కాకిలా అయిపోయాడు’ అనే డైలాగ్​ మనం తరచూ వింటూనే ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిప్పులు చెరుగుతున్న భానుడి ప్రతాపానికి ప్రజలు ఎంతగా అల్లాడిపోతున్నారో.. ప్రభుత్వం వేస్తున్న కరెంట్‌ బిల్లుల షాక్‌కు అంతకుమించి విలవిల్లాడుతున్నారు. బిల్లులు చూసి బాబోయ్ అంటూ.. నోరెళ్లబోడుతున్నారు. ఎందుకుంటే వందల్లో వచ్చే బిల్లు వేలు దాటిపోతున్నాయి. బాదుడే బాదుడు అంటు.. పాదయాత్రలో జగన్‌ తీసిన దీర్ఘాలు తలుచుకుని.. ఇదేం వీరబాదుడన్నా అంటూ బెంబేలెత్తుతున్నారు. ట్రూ అప్‌, ఇంధన సర్దుబాటు, విద్యుత్‌ సుంకం, కస్టమర్‌ ఛార్జీలు.. ఇలా రకరకాలుగా ప్రజల నుంచి ప్రభుత్వం బాదేస్తోంది. అవేంటో కూడా సామాన్య ప్రజలకు ఓ పట్టాన అర్థంకాక విలవిల్లాడుతున్నారు.

విద్యుత్ సబ్సిడీ భారం పూర్తిగా ప్రభుత్వం పైనే పడకుండా.. ఎంతో కొంత ఛార్జీల పెరుగుదలను ప్రజలు అంగీకరించాలని.. 2021-22 టారిఫ్‌ ఆర్డర్‌ ప్రకటించే సమయంలో ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌.. జస్టిస్‌ నాగార్జునరెడ్డి కోరారు. ఆయన మాటలకు అర్థం ఇప్పుడు.. కరెంటు బిల్లుల రూపంలో ప్రజలకు తెలిసొస్తోంది. 2019లో.. విజయవాడలో 75 యూనిట్ల లోపు వాడిన వినియోగదారుడి నుంచి యూనిట్‌కు సగటున.. రూపాయి 83పైసలు వసూలు చేస్తే.. 2023 మే బిల్లులో ఒక్కో యూనిట్‌కు 3రూపాయల 51పైసల చొప్పున కట్టాల్సి వస్తోంది. అంటే యూనిట్‌కు.. రూపాయి 68పైసలు అదనంగా బాదేస్తున్నారు. ఇందులో.. టారిఫ్‌ల పెంపు, శ్లాబుల మార్పు, స్థిర ఛార్జీల వల్ల 86 పైసలు పెరగ్గా.. ట్రూఅప్‌, సర్దుబాటు ఛార్జీల రూపంలో మరో 82 పైసల భారం పడింది. ఓ ఫ్యాన్‌, రెండు లైట్లు వాడే పేద కుటుంబం సైతం.. నెలకు 75 యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తుంది. వారిపైనా.. నెలకు రూ.126 చొప్పున, ప్రతి సంవత్సరం 15 వందల 12 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది.

ఇక నెలకు 400 యూనిట్లు వాడే వినియోగదారులకు.. 2019లో ఒక్కో యూనిట్‌పై సగటున రూ.6.08 చొప్పున రూ.2వేల 432 బిల్లు వచ్చేది. అదే కనెక్షన్‌పై నేడు యూనిట్‌కు సగటున రూ.7.76 చొప్పున అంటే రూ.3వేల 104 బిల్లు వస్తోంది. అంటే ప్రతినెలా ప్రభుత్వం అదనంగా వసూలు చేస్తోంది.. అక్షరాలా 672 కోట్ల రూపాయలు! ఆ లెక్కన ఏడాదికి 8 వేల64 కోట్ల రూపాయలు. కేవలం మే నెలలోనే 3రకాల భారాలను ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారులపై మోపింది.. బిల్లు రసీదులో.. ఒక ట్రూ అప్‌తో పాటు రెండు సర్దుబాటు ఛార్జీలు ఉన్నాయి. 2014-19లో వాడిన కరెంటుకు ట్రూఅప్‌ ఛార్జీలు, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌ నెలకు సంబంధించి సర్దుబాటు ఛార్జీలు వేశారు

రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులు.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 11 వేల 270 కోట్ల రూపాయల అదనపు భారం మోయాల్సి వస్తోంది. 2021-22 టారిఫ్‌ ఆర్డర్‌లో నెలకు 500 యూనిట్ల వినియోగం దాటిన... 1.4 లక్షల కనెక్షన్లపై యూనిట్‌కు అదనంగా 90 పైసలు వేసింది. దీంతో సంవత్సరానికి సుమారు రూ.13 వందల కోట్ల భారం పడుతోంది. 2021 ఏప్రిల్‌ నుంచి.. గృహ విద్యుత్‌ కనెక్షన్లపై కిలోవాట్‌కు 10 రూపాయల వంతున.. స్థిరఛార్జీలు వసూలు చేస్తోంది. ఈ కారణంగా రూ.300 కోట్లు పిండుకుంటోంది. శ్లాబుల మార్పు,.. టారిఫ్‌ల సవరణ రూపంలో ఏటా రూ.14వందల కోట్లు అదనంగా గుంజుకుంటోంది.

2014-19 మధ్య కాలంలో.. విద్యుత్‌ కొనుగోలు వ్యయానికి, వినియోగదారుల నుంచి.. వసూలు చేసిన ఛార్జీలకు మధ్య వ్యత్యాసాన్ని పూడ్చేందుకు ప్రజలపైనే భారం మోపారు. 2022 జులై నుంచి.. 25 నెలల వ్యవధిలో వినియోగదారుల నుంచి రూ.2వేల 910.74 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీ(APERC) అనుమతిచ్చింది. దీంతో.. ఈ సంవత్సరంలో పడే భారం రూ.13వందల 97 కోట్లు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి,.. రూ.3వేల 082.99 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల వసూలును గత ఏప్రిల్‌ నుంచే.. డిస్కంలు ప్రారంభించాయి.

ఈ ఏడాది 12 నెలలూ వసూలు చేయనున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఇంధన సర్దుబాటుకు కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. ఒక నెలలో సర్దుబాటు ఛార్జీలను తర్వాతి నెల బిల్లులోనే వసూలు చేస్తారు. ఆ కారణంగానే.. మే నెల బిల్లుల్లో వినియోగదారులపై 250 కోట్ల మేర అదనపు భారం పడింది. ఇలా.. ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు 11వేల270 కోట్లు అదనంగా.. వసూలు చేస్తోంది. ఇవి చాలవన్నట్టు గృహ, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు ప్రభుత్వం.. స్మార్ట్‌ మీటర్లు అమర్చబోతోంది. గృహ వినియోగదారులకు అమర్చే స్మార్ట్‌ మీటర్ల వ్యయాన్ని వారి నుంచే వసూలు చేయనుంది. వ్యవసాయ మోటార్లకు.. అమర్చే స్మార్ట్‌ మీటర్ల భారాన్ని ట్రూ అప్‌ ఛార్జీల రూపంలో.. మళ్లీ ప్రజలపైనే వేయనుంది.

ABOUT THE AUTHOR

...view details