Continuous Power Cuts In AP: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు విద్యుత్ చార్జీల వాతలు.. మరోవైపు సమయం, సందర్భం లేకుండా పోతున్న విద్యుత కోతలతో.. సామాన్యులు అల్లాడిపోతున్నారు. వరుసగా రెండో ఏడాదీ విద్యుత్ కష్టాలతో.. పల్లెలు, పట్టణాలు గాఢాంధకారంలోనే వెళ్లిపోతున్నాయి. డిమాండ్‌లో అసాధారణ పెరుగుదల లేకున్నా.. రాష్ట్ర ప్రజలకు విద్యుత్ కోతలు మాత్రం తప్పడం లేదు. రోజువారి విద్యుత్ వినియోగానికి సరిపడా విద్యుత్‌ని కొనుగొలు చేయడంలో ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వ అలాలోచిత చర్యలతో ప్రజలు కరెంట్ కోతలతో నానా అగచాట్లు పడుతున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన సమయానికి ఏపీలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్పత్తి లేక సర్దుబాటు కోసం రోజూ 15 మిలియన్ యూనిట్ల మేర.. టీడీపీ సర్కారు కోతలు విధించేది. రాష్ట్రాభివృద్దిలో కీలకమైన విద్యుత్ పై నాటి సీఎం చంద్రబాబు పటిష్టమైన చర్యలకు దిగడంతో.. కేవలం ఐదు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా మార్చేసింది. అటు తరువాత ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే తప్పా.. రాష్ట్రంలో విద్యుత్ కోతలనే మాటా రాలేదు. మళ్లీ ఏడేళ్ల తర్వాత.. గతేడాది నుంచే రాష్ట్రంలో విద్యుత్ కోతలు మళ్లీ అనుభవంలోకి వచ్చాయి.
ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోతే ఆ రాష్ట్రాన్ని కరెంటు లేక చీకట్లు కమ్ముకుంటాయని అప్పట్లో అంచనా వేశారు. కానీ, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌పై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ.. తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా సరఫరా చేస్తోంది. సాగుకు 24 గంటలు ఉచితంగా అందిస్తోంది. కాని ఇక్కడ మాత్రం వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేడు ఏపీని కరెంటు కష్టాలు చుట్టుముట్టాయి.
సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ కన్న.. మన రాష్ట్రంలోనే విద్యుతుత్పత్తి వనరులు ఎక్కువగా ఉన్నాయి. అయినా రాష్ట్రంలోనే కోతలు విధించాల్సి రావడం.. పక్కగా ముందు చూపు లేకపోవడమేనని తేలిపోతుంది. విద్యుత్ చార్జీలపై ముందుస్తు చూపును ప్రదర్శించిన జగన్ సర్కార్.. ట్రూఅప్, ఇంధన సర్దుబాటు పేర్లతో ఏటా అదనంగా 10 వేల కోట్ల భారాన్ని మోపింది. చార్జీలపై దృష్టి తప్పా.. రాష్ట్రం చీకట్లోకి వెళ్ళిపోతుందనే భావన ప్రభుత్వానికి లేకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
దక్షిణాదిలో 40.83 శాతం లోటు.. ఏపీలోనే:దక్షిణాది రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్ పరిధిలో ఏపీతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాల గ్రిడ్‌లను ఎస్‌ఎల్‌డీసీ నియంత్రిస్తుంది. ఎస్‌ఎల్‌డీసీ పరిధిలోని రాష్ట్రాల్లో కలిపి సోమవారం 16.85 ఎంయూల విద్యుత్ లోటు ఉంది. అందులో 6.88 ఎంయూలు మన రాష్ట్రానికి సంబంధించిందే.
మొత్తం లోటులో 40.83 శాతం ఏపీలోనే ఉంది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. తెలంగాణలో లోటు 0.28 ఎంయూలు మాత్రమే. అంటే, విద్యుత్ కోతలు లేకుండానే 234.32 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆ రాష్ట్రలకు సంబంధించిన డిస్కంలు సర్దుబాటు చేసి అందించాయి.
రాష్ట్రంలో సోమవారం విద్యుత్ డిమాండ్ 227.05 ఎంయూలుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్పత్తి వనరులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా వచ్చే విద్యుత్ పోనూ, బహిరంగ మార్కెట్‌లో 47.59 ఎంయూల వరకు డిస్కంలు కొన్నాయి. అయినా, డిమాండ్ మేరకు సరఫరా చేయలేదు.
Huge increase in electricity demand: ఎడాపెడా విద్యుత్ కోతలు.. ప్రభుత్వ వైఫల్యమే: పయ్యావుల
6.88 ఎంయూల విద్యుత్ కోతను అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో విధించారు. అందువల్ల రాష్ట్రంలోని పలు గ్రామాలు, కొన్ని పట్టణాల్లో రాత్రి 7గం. నుంచి సుమారు నాలుగైదు గంటల సమయం పాటు కరెంట్ కోతలు విధించారు. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పినందుకు అత్యవసర సమయంలో జాతీయ గ్రిడ్ నుంచి 250 మెగావాట్ల విద్యుత్‌ను సర్దుబాటు కింద తీసుకునే వెసులుబాటు కేంద్రం నిర్దేశంతో ఏపీకి లభించింది. ఆ విద్యుత్‌ను రాష్ట్రం ప్రతిరోజు తీసుకుంటున్న కూడా కోతలు తప్పడం లేదు.
విజయవాడ వీటీపీఎస్, ఆర్‌టీపీపీల్లో వార్షిక నిర్వహణ కోసం ఒక్కోటి 210 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లలో ఉత్పత్తి నిలిచింది. వార్షిక నిర్వహణ కోసం ఆగస్టు నుంచి దశల వారీగా థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపేయడం సహజమే. ఎన్‌టీపీసీకి చెందిన తాల్చేరు, సింహాద్రి, కూడ్గి థర్మల్ కేంద్రాలను వార్షిక నిర్వహణ కోసం ఆపేయడంతో వాటి నుంచి రావాల్సిన 885 మెగావాట్ల విద్యుత్ నిలిచింది. దీనికి ప్రత్యామ్నాయ చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు.
Protest against Power Cuts: విద్యుత్ కోతలతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి