ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శ్రీ శోభకృత్ నామ సంవత్సర' ఉగాది.. శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు

leaders extend Ugadi greetings: ‘ఉగాది' పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్​తో పాటుగా సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్... శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Ugadi greetings
ఉగాది శుభాకాంక్షలు

By

Published : Mar 21, 2023, 8:38 PM IST

Ugadi Greetings: ‘ఉగాది' పండుగ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్​తో పాటుగు వివిధ పార్టీల నేతలు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ ఉగాదిని తెలుగు ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ శ్రీ శోభకృతు నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉగాది' పండుగ తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగ అని అన్నారు. తెలుగు వారు ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే ఈ నూతన సంవత్సరం, అందరిలో కొత్త ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును తేవాలని ఆకాంక్షించారు. జీవితంలోని షడ్రుచులను కలగలిపి ఉండే 'ఉగాది పచ్చడి', ఏడాది పొడవునా జీవితం మనకు అందించే అనేక అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.

వైయస్‌ జగన్‌: శ్రీ శోభకృత్ నామ ఉగాది సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్ళలో నూతన సంవత్సర శోభను తెస్తుందని సీఎం తెలిపారు. కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సంవత్సరం రైతులందరికీ మేలు కలగాలని, అన్ని వృత్తుల వారు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. పల్లెల్లో, పట్టణాల్లో... ప్రతి ఇల్లూ కళకళలాడాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

చంద్రబాబు శ్రీ శోభకృత్ నామ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు ప్రగతి శోభ రావాలంటూ ఆకాంక్షించారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చే నవోదయం రావాలంటూ చంద్రబాబు వెల్లడించారు.

పవన్ కళ్యాణ్:శోభకృత్ నామ సంవత్సరం తెలుగు కుటుంబాలన్నీ శోభాయమానం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వసంతం మోసుకొచ్చే ఉగాది పండుగ మన తెలుగువారందరికి ప్రీతిపాత్రమైనదన్నారు. సంక్రాంతి వేళ పంటలు ఇంటికి వస్తే.. ఉగాదితో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇలా మన పండుగలన్నీ ప్రకృతితో పెనవేసుకున్నవే కావడం వల్ల అంత శోభాయమానంగా వెల్లివిరుస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రజలందరికీ ఆరోగ్యం-ఆనందంతోపాటు సిరిసంపదలను ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

నారా లోకేశ్‌: శోభకృత్ నామ సంవత్సరం తెలుగు కుటుంబాలన్నీ శోభాయమానం కావాలంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభ‌కృత్ నామ సంవత్సరంలో తెలుగు ప్రజలంద‌రికీ శుభాలు క‌ల‌గాలని కోరుకున్నట్లు వెల్లడించారు.

బాలకృష్ణ:నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే శోభకృత్ స్ఫూర్తిని గుండెల్లో నింపుకోవాలని బాలకృష్ణ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను కోరారు. శోభకృత్ నామ సంవత్సరం కొత్త ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును తేవాలని ఆకాంక్షిస్తున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details