గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో లబ్ధిదారులకు టిడ్కో గృహాలను పంపిణీ చేయకపోవటంతో... అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టారు. తెదేపా హయాంలో చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల విస్తీర్ణంలో... టిడ్కో ఆధ్వర్యంలో 6512 పీఎంఏవై గృహ నిర్మాణాలను చేపట్టింది. ఆ ఇళ్లను వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవటాన్ని నిరసిస్తూ... ఇళ్లను వారికి స్వాధీనపర్చే కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. పోలీసులు ముందస్తుగా పలు పార్టీల నేతలను గృహ నిర్భంధం చేశారు. అయితే కొందరు అఖిలపక్ష నాయకులు లబ్ధిదారులతో కలసి ఎన్ఆర్టీ సెంటర్ నుంచి టిడ్కో ఇళ్ల వరకు ర్యాలీగా బయలుదేరగా...తెదేపా కార్యాలయం వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. లబ్ధిదారులు, నాయకులు చిలకలూరిపేట-నరసరావుపేట రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులతో మాట్లాడి... ఇళ్ల స్వాధీనం కార్యక్రమానికి అనుమతి లేదని, నిరసన విరమించాలని సూచించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో స్టేషన్ కు తరలించారు.