విజయవాడ వచ్చిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు నోటీసులు ఇచ్చిన కృష్ణలంక పోలీసులు.. ఆయన్ను ఉండవల్లిలోని తన ఇంటికి తరలించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం, కొవిడ్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు కృష్ణలంక పోలీసులు పేర్కొన్నారు.
పోలీసుల తీరుపై లోకేశ్ ఆగ్రహం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నరసరావుపేట పర్యటన ఉత్కంఠగా మారింది. నరసరావుపేట పర్యటన కోసం వచ్చిన లోకేశ్‌ను మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ కాన్వాయ్ మధ్యాహ్నం ఒంటి గంటకు కనకదుర్గ వారధి వద్దకు చేరుకుంది. కనకదుర్గ వారధి నుంచి నరసరావుపేట వెళ్లేందుకు యత్నించారు. లోకేశ్.. నరసరావుపేట వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో పోలీసులకు, ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉండవల్లిలోని లోకేశ్ ఇంటికి తరలించేందుకు పోలీసులు యత్నించారు. లోకేశ్‌ను కారులో నుంచి బలవంతంగా లాగేందుకు యత్నించిన పోలీసులపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనను అడ్డుకోవడంపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని లోకేశ్, పార్టీ నేతల పట్టుపట్టారు. దీంతో రోడ్డుపైనే లోకేశ్‌కు నోటీసులు ఇచ్చారు. దాదాపు 2 గంటలపాటు కనకదుర్గ వారధి వద్ద లోకేశ్ కాన్వాయ్ నిలిచింది. దీంతో కృష్ణా వారధి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద లోకేశ్‌కు రోడ్డుపైనే నోటీసు జారీచేసి ఉండవల్లిలోని ఇంటికి తరలించారు.