Police Stopped Amaravati Farmers: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరంలో దీక్షలు చేపడుతున్న ఆయన సతీమణి భువనేశ్వరికి( (Nara Bhuvaneswari Initiation in Rajamahendravaram) మద్దతు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఇవాళ ఉదయం భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు రాజధాని రైతులు రాజమహేంద్రవరం బయల్దేరి వెళ్లారు. తుళ్లూరు, వెలగపూడికి చెందిన రైతులు, మహిళలు ప్రత్యేక బస్సుల్లో రాజమండ్రికి పయనమయ్యారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమంగా జైలులో నిర్బంధించినదని, ఇలాంటి క్లిష్ట సమయంలో తామంతా భువనమ్మకు అండగా ఉంటామని రైతులు తెలిపారు.
వీరంతా మధ్యాహ్నం తర్వాత రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. భువనేశ్వరిని పరామర్శించి.. సంఘీభావం ప్రకటించనున్నారు. అయితే రాజమహేంద్రవరంలో ఉన్న నారా భువనేశ్వరిని పరామర్శించేందుకు ప్రత్యేక బస్సులు, సొంత వాహనాల్లో రాజధానిలోని వివిధ గ్రామాల నుంచి బయల్దేరిన రాజధాని రైతులను నల్లజర్ల టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజమహేంద్రవరం వెళ్లేందుకు అనుమతి లేదంటూ బస్సులను నిలిపివేశారు. బస్సు డ్రైవర్లను బలవంతంగా పోలీసులు దించేశారు.
దీంతోపాటు రాజమండ్రి బయలుదేరిన ఇంకొంతమంది రైతుల బస్సులను వీరవల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిలిపివేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను కలిసి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసుల తీరుపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తామేమి పాకిస్థాన్ నుంచి రాలేదని, రాష్ట్ర రాజధాని మహిళలైన తాము.. రాజమహేంద్రవరం వెళ్లేందుకు ఎవరి అనుమతి తీసుకోవాలంటూ పోలీసులతో వాదనకు దిగారు.