ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

farmers maha dharna: గుంటూరు ఛానెల్ కోసం రోడ్డెక్కిన రైతులు.. పోలీసుల ఉక్కుపాదం - FARMERS DHARNA

farmers maha dharna: గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద 20 రోజులుగా దీక్ష చేస్తున్న రైతులు మహాధర్నాకు పిలుపు నిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి పెద్ద ఎత్తున వెళ్తున్న రైతులు, మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఏటుకూరు, ఐదో మైలు వద్ద పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను నిలవరించడంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం నెలకొంది.

గుంటూరు ఛానెల్ కోసం రోడ్డెక్కిన రైతులు
గుంటూరు ఛానెల్ కోసం రోడ్డెక్కిన రైతులు

By

Published : Jul 18, 2023, 6:06 PM IST

గుంటూరు ఛానెల్ కోసం రోడ్డెక్కిన రైతులు

farmers maha dharna: గుంటూరు ఛానెల్ పొడిగింపు కోసం రైతులు రోడ్డెక్కారు. తాగు, సాగు నీరు కావాలని అడుగుతున్నా ప్రభుత్వానికి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఛానెల్ పొడిగించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు రైతులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పర్చూరు, పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు మండలాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరాగా.. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట సమీపంలోని ఐదో మైలు వద్ద పోలీసులు అడ్డగించారు. దీంతో మహిళలు, రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. గుక్కెడు నీటి కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపుతోందని ఆరోపించారు. పెదనందిపాడు, ప్రత్తిపాడు సభలలో సీఎం జగన్ గుంటూరు ఛానల్ పొడిగిస్తామని హామీ ఇచ్చి... మాట తప్పారని ఆరోపించారు. రైతులను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డగించడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట పాటు రహదారిపై ధర్నా నిర్వహించారు. వాహనాలు నిలిచిపోయాయి. ధర్నా చేస్తున్న మహిళలను.. మహిళా పోలీసులు ఎత్తుకెళ్లి పోలీసు వాహనంలో పడేశారు. పోలీసులు, మహిళల మధ్య తోపులాట జరిగింది. చివరకు రెండు బస్సుల్లో చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్దకు తరలించారు.

అడ్డుకున్న పోలీసులు... గుంటూరు ఛానల్ పొడిగించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట నిర్వహిస్తున్న మహా ధర్నాకు రైతులు, మహిళలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో 20 రోజులుగాగుంటూరు కలెక్టరేట్‌ ఎదుట రైతులు నిరాహారదీక్ష చేస్తున్నారు. రైతుల దీక్షకు అధికార వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అడుగడుగునా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ.. ఏటుకూరు, ఐదో మైలు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆటోలో దీక్షకు వెళ్తున్న మహిళలను అడ్డుకుని పోలీసు వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు. సాగు, తాగు నీటి కోసం పోరాడుతుంటే.. ప్రభుత్వం పోలీసులతో అణచివేయాలని చూస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో మహిళలు, రైతులు వాగ్వాదానికి దిగారు.

మూడు వారాలుగా దీక్ష.. మహాధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన రైతు సంఘాల నాయకుల్ని గుంటూరు కలెక్టరేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులను దీక్షా శిబిరం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా రైతు సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు. రైతుల దశాబ్దాల కోరిక అయిన గుంటూరు ఛానల్ పొడిగించాలని మూడు వారాలుగా నిరసన దీక్షలుచేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులు, రైతు సంఘాల నేతల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. నీళ్ల కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని నల్లమడ రైతు సంఘం నేత కొల్లా రాజమోహన్ తెలిపారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఛానల్ పొడిగింపునకు నిధులు ఇచ్చే వరకు ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.

గుంటూరు ఛానల్‌ను పొడిగించాలని కోరుతూ శాంతియుత ఉద్యమం చేస్తున్న రైతులను అరెస్ట్‌ చేయడం రాష్ట్ర ప్రభుత్వ పిచ్చికి పరాకాష్ట అని రైతు నాయకులు మండిపడ్డారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద మహాధర్నాలో అరెస్ట్‌లు చేయటాన్ని ఖండించారు. ప్రభుత్వం తక్షణం ఛానల్‌కు నిధులను మంజూరు చేయాలని లేకుంటే రానున్న రోజుల్లో రైతులే తగిన రీతిలో బుద్ధి చెబుతారని చిలకా బసవయ్య హెచ్చరించారు. ఛానల్‌ పనులు ప్రారంభించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details