గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై లాక్డౌన్ అమలుకు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ చెక్‌పోస్టు పర్యవేక్షణాధికారిగా సీఐ వెంకన్నచౌదరిని నియమిస్తూ గ్రామీణ ఎస్పీ విజయారావు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ బాధ్యతలు తీసుకున్న వెంకన్నచౌదరి పనితీరుకు స్థానికులు, అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల యజమానులు బెంబేలెత్తిపోయారు. విధి నిర్వహణలో ఓ సినిమాలో బాధ్యతగల పోలీస్ అధికారి సీతయ్య పాత్రను తలపిస్తూ పని చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అత్యవసర సేవల వాహనాలను మాత్రమే అనుమతించారు.
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులను ఏమాత్రం పట్టించుకోలేదు ఈ సీఐ. సోమవారం చిలకలూరిపేట తహసీల్దార్ వాహనాన్ని నిలిపివేశారు. తాను విధి నిర్వహణలో ఉన్నానని ఆమె చెప్పగా వదిలేశారు. వివిధ ప్రాంతాల నుంచి వైద్య సేవలు అందించేందుకు వెళ్తున్న వైద్యుల కార్లనూ నిలిపివేశారు. అత్యవసర సేవలు అందించాలని వారు చెప్పిన పట్టించుకోలేదు. ఒంగోలులో వైద్యులుగా పని చేసేవారు గుంటూరు నుంచి ఎందుకు వెళ్తున్నారని... అనుమతించబోనని వెంకన్నచౌదరి తేల్చిచెప్పారు.