ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనిపించని ఆ  నాలుగో సింహమే పోలీస్​!

కనిపించే మూడు సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే...కనిపించని ఆ నాలుగో సింహామే పోలీసుల మానవత్వం. ఈ కథకు ఈ డైలాగే సరిపోతుంది. ఎందుకంటారా? ఒక్కసారి కథలోకి వెళ్దాం....

కనిపించని ఆ  నాలుగో సింహమే పోలీస్​!

By

Published : Apr 21, 2019, 7:40 AM IST

ఖాకీల కఠినత్వం....కనికరం లేని ఖాకీలు...ఇవి పోలీసుల దురుసు ప్రవర్తన గురించి తరచుగా వినే మాటలు. ఇది నాణేనికి ఒకవైపే. తమలోనూ మానవత్వం ఉందని చాటారు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు. ఎవరూ లేని ఓ వృద్ధురాలి బాగోగులు చూసుకుంటూ అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. బిడ్డల్లేని తల్లికి సొంత కుమారుల్లా చూసుకుంటున్నారు.

కనిపించని ఆ నాలుగో సింహమే పోలీస్​!
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ 14వ తేది... మధ్యాహ్నం 3 గంటలు..తమ వారిని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారంటూ ఓ రాజకీయపార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అప్పటికే భోజన సమయం మించిపోయింది. వచ్చినవారు పోలీసులతో మాట్లాడుతున్నారు. కేసు నమోదు గురించి చర్చిస్తున్నారు. వారి మాటలకు అడ్డు తగిలింది ఓ వృద్ధురాలు. పోలీసులకు అన్నం తినే సమయమైంది. పోయి మళ్లీ రమ్మని మూగ సైగలు చేసింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ సీఐని చూసిన ముసలావిడ అతని దగ్గరకు వెళ్లింది. అతనూ ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సీఐకి వృద్ధురాలికి ఉన్న అనుబంధంపై ఆరా తీశారు. కేవలం సీఐతోనే కాదు. అక్కడ పనిచేసే పోలీసులందరి పట్లా వృద్ధురాలి తల్లిప్రేమ గురించి తెలుసుకుని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. అసలు కథ ఇక్కడ మెుదలైంది..! తాడేపల్లి పోలీస్ స్టేషన్​లో రవిబాబు ఎస్సైగా విధుల నిర్వహిస్తున్న సమయంలో ఎక్కడ నుంచో వచ్చిన ఆ వృద్ధురాలికి అన్నీ తానై వ్యవహరించారు. సొంత తల్లి కంటే ఎక్కువ చూసుకున్నారు. ఆ అధికారితోపాటు మరో కానిస్టేబుల్ సైతం మాటలురాని ఆ వృద్ధురాలికి సపర్యలు చేశారు. ఆ అనుబంధం ఆ తర్వాతా కొనసాగింది. రవిబాబు బదిలీపై అక్కడి నుంచి వెళ్లిపోయినా స్టేషన్‌లో పనిచేసే అధికారులు, సిబ్బంది ఆ వృద్ధురాలిపై మమకారం కొనసాగించారు. అదే రవిబాబు ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా విధుల నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్​కు వచ్చారు. రవిబాబుని చూడగానే వృద్ధారాలిలోని మాతృప్రేమ బయటకు వచ్చి ఆలింగనం రూపంలో ఆప్యాయత కనబర్చింది. కేవలం రవిబాబే కాదు... ఇక్కడ పనిచేస్తున్న వారంతా ఈ వృద్ధురాలితో ఏ బంధం లేకపోయినా కాలం కలిపిన ప్రేమకు తామంతా బంధీలయ్యామని చెబుతున్నారు. మాటలు రాకపోయినా తన సైగలతోనే... ఓ తల్లిలా తమని అన్నం తినమని.... ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతుంటే తల్లిప్రేమ గుర్తుకు వస్తుందంటున్నారు. అసలు ఆ వృద్ధురాలి ఎక్కడనుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. మాటలు రాని ఆమె కూడా చెప్పలేకపోయింది. 10ఏళ్లకు పైగానే తాడేపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంటోంది. పోలీస్ స్టేషన్ శుభ్రం చేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె కోసం పక్కనే చిన్న గది ఏర్పాటు చేశారు. ఆమెకు కావాల్సిన ఆహారం పోలీసులే అందిస్తారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పోలీసులే తీసుకెళ్లి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తారు. పేరు, ఊరు తెలియకపోయినా వృద్ధురాలిని కన్నతల్లిగా ఆదరిస్తున్న పోలీసుల ప్రేమను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details