గుంటూరు జిల్లా నరసరావుపేటలోని వీధుల్లో, ప్రధాన రహదారుల్లో కొందరు వాహనాలపై కనీసం మాస్క్లు లేకుండా సంచరిస్తుండడంపై పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటివారిని నాలుగు తన్ని మాస్క్ లు వేయించి పంపిస్తున్నారు. ఇకపై పని లేకుండా వీధుల్లో తిరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేయాలంటూ పోలీసు సిబ్బందికి నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. పోలీసులు, పురపాలక సంఘం అధికారులు దుకాణాలను మూయించారు. రోడ్లపై తిరిగే వాహనాలను ఎక్కడికక్కడి నుంచే వెనక్కి పంపుతున్నారు. రోడ్లపైకి వచ్చే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆలయాలు భక్తులు లేక బోసిపోయాయి. వీధులన్నీ ట్యాంకర్లతో కడుగుతున్నారు. ప్రధాన వీధుల్లో చేతులు శుభ్రం చేసుకునేందుకు పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక వాష్ బేషిన్ లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రోడ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంగళగిరికి వచ్చే రహదారులన్నీ మూసేశారు.