Adibatla Kidnapping Case Updates: హైదరాబాద్ దంతవైద్యురాలి కిడ్నాప్ కేసులో పోలీసులు నవీన్ రెడ్డిని సాయంత్రం వరకు హైదరాబాద్ తీసుకురానున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు రూమెన్, సిద్ధు, చందుని నిన్న ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. వరంగల్‌లో 2 ఏళ్ల క్రితం నవీన్ రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు కాగా.. పీడీ చట్టం నమోదు చేసే యోచనలో రాచకొండ పోలీసులు ఉన్నారు. కేసులో మొత్తం ఇప్పటి వరకూ పోలీసులు 36 మందిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిదంటే: అమెరికా పెళ్లి సంబంధంరావడంతో హైదరాబాద్ మన్నెగూడకు చెందిన దంతవైద్యురాలికి ఈనెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్ధం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్రపన్నాడు. ఇందుకోసం అనుచరులతోపాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పనిచేసే 36మందిని ముందురోజు రాత్రి మన్నెగూడకు రప్పించాడు.
అమెకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారంటూ నమ్మించి అపహరణ ప్రణాళికను రచించాడని పోలీసులు తేల్చారు. నవీన్ రెడ్డి సహా అంతా ఉదయం 11:30 గంటలకు.. మూడుకార్లు, ఓ డీసీఎంలో మన్నెగూడలోని యువతి ఉండే ఇంటికి చేరుకున్నారు. పథకం ప్రకారం కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్ రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్‌పైనా వారు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి సోఫా, ఫర్నీచర్ సహా ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు.