Police issued notices CRPC section: తెలంగాణలో 'తెరాస ఎమ్మెల్యేలకు ఎర' నిందితులకు పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోపు విచారణకు హాజరుకావాలని నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లకు మొయినాబాద్ పోలీసులు సూచించారు. గురువారం రాత్రే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సరైన ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గురువారం నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) వర్తించదని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను గురువారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నిందితులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు.
భాజపాలో చేరాలంటూ తెరాసకు చెందిన తాండూరు, అచ్చంపేట, కొల్లాపూర్, పినపాక ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను ప్రలోభపెట్టారని ముగ్గురు నిందితులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగింది..‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితులను రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు గురువారం రాత్రి సరూర్‌నగర్‌లోని న్యాయమూర్తి జి.రాజగోపాల్ నివాసానికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) వర్తించదని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో నిందితుల్ని విడిచిపెట్టామని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు.