తాడేపల్లిలోని పుష్కరఘాట్ అత్యాచార ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రి సుచరిత ధ్రువీకరించారు. పూర్తి విచారణ తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని ఆమె తెలిపారు. యువ జంట వద్ద నిందితులు దోచుకెళ్లిన ఫోన్ల ద్వారానే వారు పట్టుబడ్డారు. తాడేపల్లికి చెందిన తాపీమేస్త్రీకి నిందితులు ఫోన్‌ను విక్రయించారు. అప్పటి నుంచి స్విచ్ఛాప్‌లో ఉన్న ఫోన్‌ను మంగళవారం ఆన్‌చేయగానే...టవర్ లొకేషన్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఫోన్ వినియోగిస్తున్న మహిళను విచారించగా ...తన భర్తకు విజయవాడలో ఎవరో విక్రయించారని తెలిపారు. ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఒకరిది తాడేపల్లి.. మరొకరిది చినగంజాం...
నిందితులిద్దరికీ నేరచరిత్ర ఉంది. వారిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. కృష్ణా నది పరిసర ప్రాంతాల్లోని నిర్జన ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్నవారిపై దాడి చేసి దోచుకుంటారని తెలిసింది. వీరిలో ఒకరిది తాడేపల్లి కాగా...మరొకరిది ప్రకాశం జిల్లా చినగంజాం. ఈనెల 19న రాత్రి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు నదీమార్గంలో పడవపై పారిపోయి తాడేపల్లికి చేరుకున్నారు. పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయడంతో 20న పరారయ్యారు.