Sankalp Siddhi Scam: సంకల్పసిద్ధి కుంభకోణంలో కీలక నిందితుడిగా భావిస్తున్న గుత్తా కిరణ్ ఎట్టకేలకు చిక్కాడు. నాలుగున్నర నెలలుగా పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న కిరణ్.. రెండ్రోజుల క్రితం బళ్లారి సమీపంలోని హోస్పేటలో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొరికాడు. నిందితుడిని విజయవాడకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. వివిధ స్కీమ్‌ల పేరుతో వసూలు చేసిన డబ్బును ఎక్కడికి తరలించారు.? స్థిర, చరాస్తులను ఎక్కడ కొనుగోలు చేశారు.? అవి ఎవరి పేరున ఉన్నాయి?. వంటి వివరాలను నిందితుడి నుంచి రాబట్టే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సమాచారం సేకరించిన తర్వాత కిరణ్ అరెస్ట్‌ను చూపించే అవకాశం ఉంది.
సంచలనం రేపిన సంకల్పసిద్ధి కుంభకోణం కేసులో కీలక నిందితుడు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో గతేడాది నవంబరులో వెలుగుచూసిన ఈ స్కాం 130 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మొత్తం 17 బ్యాంకు అకౌంట్ల ద్వారా అధిక శాతం లావాదేవీలు జరిగినట్లు తేలింది. డిపాజిటర్ల సంఖ్య 45 వేల వరకు ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేసినా.. కీలక సూత్రధారి కిరణ్ దొరకపోవడంతో పురోగతి లోపించింది.
ప్రత్యేక బృందాలు బెంగళూరు, బళ్లారి, అనంతపురం ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు నిందితుడు దొరకడంతో కేసులో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. మొదట దీనిని సంకల్పసిద్ధి ఈకార్ట్ ఇండియా లిమిటెడ్ పేరుతో కంపెనీని రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో గుత్తా వేణుగోపాలకృష్ణ ఎండీగా, ఆయన బంధువైన వెంకట నాగలక్ష్మిని డైరెక్టర్‌గా నమోదు చేశారు. తనకు సహాయకారిగా ఉంటాడని బళ్లారిలో ఉండే కిరణ్‌ను ఇక్కడకు తీసుకొచ్చి వ్యాపార బాధ్యతలు అప్పగించారు. దీంతో నాగలక్ష్మి స్థానంలో గుత్తా కిరణ్‌ను బోర్డులో డైరెక్టర్‌గా చేంజ్ చేశారు.