లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించి నినాదాలు చేస్తున్నారంటూ రాత్రి సమయంలో వెంకటపాలెంలో 12 మందికి తుళ్లూరు పోలీసులు నోటీసులు జారీచేశారు. సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీసుయాక్టు అమలులో ఉన్నందున బయట తిరగటం, పలువుర్ని కలవడం లాంటివి చేయడం చట్టరీత్యా నేరమనీ.. చట్టాన్ని అతిక్రమించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో కారణం తెలియజేయాలంటూ అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఐ శరత్‌బాబు ధ్రువీకరించారు.
భయపెట్టేందుకే : రైతుల ఆరోపణ
ఇళ్లలోనే వ్యక్తిగత దూరం పాటిస్తూ ఆందోళన చేస్తున్నామని, తమను భయభ్రాంతులకు గురి చేసేందుకే పోలీసులు నోటీసులు జారీ చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి అంశాన్ని అణగదొక్కే ప్రయత్నంలో పోలీసులు జారీ చేసిన నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆర్-5జోన్ ఏర్పాటుకు సంబంధించి సీఆర్‌డీఏ అధికారులు, వాలంటీర్లు గ్రామాల్లో పర్యటిస్తూ లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిస్తున్నా, వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదని ప్రశ్నించారు. ఇది కేవలం కుట్రపూరితంగా చేస్తున్న యత్నమేనని దుయ్యబట్టారు.
రమేశ్ కుమార్‌కు మద్దతివ్వాలి..
రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున కరోనా బారినపడకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేసి కాపాడిన రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి రమేశ్ కుమార్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని రాజధాని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు, రైతు కూలీలు పేర్కొన్నారు.
రమేశ్ కుమార్ చర్య వల్ల ఆంధ్రప్రదేశ్ శవాల దిబ్బగా మారకుండా ఆగిందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ‘థ్యాంక్యు రమేశ్‌కుమార్’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు.
117వ రోజుకి చేరుకున్న అమరావతి ఆందోళనలు
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న నిరసనలు 117వ రోజు కొనసాగాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, నెక్కల్లు, దొండపాడు తదితర గ్రామాల్లో ఇళ్ల ముందు, వీధుల్లో నిరసనలు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి సుదీక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు చిగురుపాటి విమల మాస్కులు పంపిణీ చేశారు. ‘అమరావతి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా రాత్రి 7 గంటలకు ఇళ్లలోని విద్యుత్తు దీపాలను ఆర్పివేసి వివిధ ఆకృతుల్లో కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు తెలిపారు.
రాజధానిగా అమరావతిని కొనసాగించాలి..
ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ప్రధాని మోదీకి అమరావతి దళిత రైతులు లేఖ రాశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చి.. రోడ్డున పడి.. గత 117 రోజుల నుంచి ఆర్థికంగా, మానసికంగా, పోలీసుల దెబ్బలతో గాయపడుతున్నప్పటికీ దీక్ష చేస్తున్నామని ప్రధాని దృష్టికి తెచ్చారు. దళిత రైతుల పట్ల దయ ఉంచి 30%-40% కౌలు పెంచి ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి:రాజ్యాంగ విరుద్ద ఆర్డినెన్స్‌ను మండలిలో అడ్డుకుంటాం: యనమల