Businessman Cheating: వివహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాడు.. రైతుల సొమ్మే కదా పోయిందంటే ఎవరు అడగరులే అనే ధైర్యంతో ఓ ప్లాన్ వేశాడు. రైతులకు చెల్లించాల్సిన నగదును దొంగలు దోచుకున్నారంటూ.. సీన్ క్రియేట్ చేశాడు. ఆ నగదును మహిళకు అందజేశాడు. అనంతరం తన వద్ద నుంచి డబ్బులు దొంగలు కాజేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు శ్రీనివాసరావు అనే వ్యక్తి. రంగంలో దిగిన పోలీసులు ఫిర్యాదుదారుడే నిందితుడని తేల్చారు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
నగదు దోచుకున్నట్లు డ్రామా: కంతేరు గ్రామానికి చెందిన గండం శ్రీనివాసరావు అనే వ్యక్తి స్థానికంగా రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేసి అమ్ముతూ ఉంటాడని సీఐ సురేష్ బాబు తెలిపారు. ఎప్పటిలాగే రైతుల నుంచి సేకరించిన పత్తిని మిల్లుకు అమ్మేశాడు. అనంతం ఈనెల 19వ తేదీన మిల్లర్ వద్ద నుంచి నగదు తీసుకొని.. గ్రామానికి బయలుదేరాడు. తాను డబ్బులతో వస్తుండగా.. పెద్దకాకాని మానస సరోవరం వద్ద ఇద్దరు వ్యక్తులు తనపై దాడి చేసి నగదు దోచుకున్నట్లు డ్రామాను సృష్టించాడని తెలిపారు. అనంతరం రైతులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు.